* బోసిపోయిన హైదరాబాద్
* ఖాళీగా కనిపిస్తున్న రోడ్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సంక్రాంతి అంటేనే సందడి. ఆ సందడిని ఆస్వాదించేందుకు నగర జనం పల్లెబాట పట్టారు. కాలనీ, బస్తీవాసులందరూ పండగకు సొంతూళ్లకు పయనమయ్యారు. శుక్రవారం సాయంత్రం నుంచే నగరవాసులు పండగ టూర్లు మొదలుపెట్టారు. కుటుంబ సమేతంగా, బంధుమిత్రులతో కలిసి నగర వాసులంతా సొంతూళ్ల బాటపట్టారు. హైదరాబాద్ మహానగరం ఖాళీగా కనిపిస్తోంది. ప్రధాన రహదారుల్లో రాకపోకలు తగ్గాయి. షాపింగ్ మాల్ కేంద్రాలు, పర్యాటక ప్రాంతాల్లో మినహా ప్రధాన జంక్షన్లలో జనసంచారం తగ్గింది.
ఐటీ కారిడార్‌లో సాఫీగా వాహనాలు
ఐటీకారిడార్ అయిన సైబరాబాద్ సాధారణంగా వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఐటీ రంగంలో దాదాపు 80 శాతం మంది వరకు ఐటీ ఉద్యోగాలు చేసే వారు మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డి స్ర్టిక్, కోకాపేట, పుప్పాల్‌గూడ, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నారు. దీంతో సంక్రాంతి సెలవులు సోమవారం నుంచి బుధవారం వరకు ఉండడంతో లక్షలాది ఐటీ ఉద్యోగులంతా శుక్రవారం సాయంత్రం నుంచే సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. ఆదివారం రాత్రి వరకు నగరం నుంచి ఎక్కువ మంది శని, ఆదివారాల్లోనే సొతూళ్లకు వెళ్లిపోయారు. ఈనేపథ్యంలోనే ఆదివారం నుంచే ఐటీ కారిడార్‌లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
కలిసొచ్చిన సెలవులు
ఐటీ ఉద్యోగులకు శని, ఆదివారాలు వీకెండ్ కావడం, సోమవారం నుంచి బుధవారం సంక్రాంతి సెలవువులు ఉండడంతో ఎక్కువ మంది అడ్వాన్స్ రిజర్వేషన్లు చేసుకున్న వారంతా రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, సొంత వాహనాల్లో సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో గత రెండు రోజులుగా హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి, హైదరాబాద్ – బెంగళూరు, వరంగల్, రాజీవ్‌రహదారి, నాగ్‌పూర్ హైవేపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్ మెట్, చౌటుప్పల్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు రహదారులు బారులు తీరి కనిపిస్తున్నాయి. టోల్‌ప్లాజాల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలే కనిపిస్తున్నాయి. గత సంక్రాంతితో పోలిస్తే ఈ ఏడాది చాలా మంది పండక్కి ఊరేళుతున్నారని ప్రస్తుత వాహనాల రద్దీని బట్టి తెలుస్తోంది.
………………………………………….