* అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం
* మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి సంబంధించి రేషన్ కార్డు అర్హత కలిగిన వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దరఖాస్తు చేసుకున్న జాబితాలో పేరు లేని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గ్రామ సభలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారు ఈ గ్రామసభల్లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు, ప్రభుత్వం సూచిస్తోంది. దీంతో గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామ సభల్లో తీవ్ర గందరగోళం, ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. 10 ఏళ్ల పాటు రేషన్‌కార్డుల జారీపై దృష్టి పెట్టలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తోందన్నారు. ప్రజాపాలన సందర్భంగా వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈనెల 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గ్రామసభలు.. ఈనెల 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే ఇప్పటికే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా.. అందులో పేరు లేకపోతే ఈ గ్రామ సభల్లో మళ్లీ అప్లై చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో.. ప్రజలు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు.
…………………………………….