* ముందస్తుగా గుర్తిస్తే వ్యాధిని నయం చేయొచ్చు
* వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
* ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
* ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటి గౌతమి
ఆకేరున్యూస్, వరంగల్: క్యాన్సర్ వ్యాధి పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి సినీ నటి గౌతమితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుండి కాళోజీ కళాక్షేత్రం వరకు నిర్వహించిన వాక్‌ను ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ… గ్రామీణ స్థాయిలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టి, తొలిదశలో గుర్తిస్తే నివారించడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఆ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడటమేనని ఎంపీ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి వస్తే పేద మధ్యతరగతి వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ చికిత్సకు, మందులకు వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తదితర వాటికి దూరంగా ఉండాలన్నారు. క్యాన్సర్ బారిన పడినవారు భయపడాల్సిన పనిలేదని, ధైర్యంతో క్యాన్సర్ జయించవచ్చని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో మొదటిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్న ప్రతిమ ఫౌండేషన్ యాజమాన్యాన్ని ఎంపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రతి మా ఫౌండేషన్ ఫౌండర్ డా. హరిణి, ప్రతిమ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డా. రమేష్, డైరెక్టర్లు డా. ప్రతీక్, డా.రాహుల్, డా.అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………..