మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క..
అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు….
ఆకేరు న్యూస్, జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అత్యంత దారుణమైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మార్చురీలో భద్రపరచాల్సిన మృతదేహం పట్ల సిబ్బంది వహించిన నిర్లక్ష్యం కారణంగా, ఒక కుక్క లోపలికి ప్రవేశించి శవాన్ని పీక్కుతినడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన నలుగురు కీలక అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో…ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళ, ఆర్ఎంవో (RMO) డాక్టర్ హరినాథ్, అప్పుడు విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ , మరియు ఎంఎన్వో (MNO) ఉన్నారు.
అసలేం జరిగింది….?
జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన భీమేశ్ (32) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల పాత ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అయితే, మార్చురీ గది తలుపులు సరిగ్గా వేయకపోవడం లేదా పర్యవేక్షణ లేకపోవడంతో ఒక కుక్క లోపలికి వెళ్లి మృతదేహాన్ని ఛిద్రం చేసింది. ఈ దృశ్యాన్ని చూసిన బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.
ఈ విషయం తెలుసుకున్న వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ మంగళవారం ఆసుపత్రిని స్వయంగా సందర్శించారు. మార్చురీ గదిలో కనీస సౌకర్యాలు లేకపోవడం, ఫ్రీజర్లు పనిచేయకపోవడం వంటి లోపాలను ఆయన గుర్తించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ ఘటనపై నిరసన తెలపడంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతదేహాలకు కూడా కనీస గౌరవం లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
