
* పార్టీలో నేతల మధ్య అసంతృప్తి జ్వాలలు
* సీఎల్పీలో రేవంత్ వ్యాఖ్యలతో బట్టబయలు
* కేబినెట్ భేటీలో దామోదర, భట్టి మధ్య వాగ్వాదం!
* ఢిల్లీ పర్యటనలో ఖర్గేతో భేటీ అయిన రేవంత్, భట్టి, మహేశ్‌కుమార్ గౌడ్
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. కులగణన జరిపి దేశానికే ఆదర్శంగా నిలిచింది. మరోవైపు.. సంక్షేమ పథకాల అమలులో దూకుడును ప్రదర్శిస్తోంది. పదేళ్లుగా పేదలకు అందని రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేసింది. రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అయినప్పటికీ.. కాంగ్రెస్ సర్కారుపై కాంగ్రెస్‌లోనే భరోసా కరువైనట్లు కనిపిస్తోంది. నేతల్లో అంతగా జోష్ కనిపించడం లేదు. ప్రతిపక్షాల విమర్శలకు సరైన బదులివ్వలేకపోతున్నారు. చేసిన పనిని చెప్పుకోలేకపోతున్నారు. దీనంతిటికీ కారణం నేతల మధ్య సఖ్యత లేకపోవడమే నన్న ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధ్య పలు విషయాల్లో బేధాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మారిన నేతల తీరు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయినప్పటికీ, కొన్నాళ్లపాటు మంత్రులూ ముఖ్యమంత్రి తరహాలోనే కీలకంగా వ్యవహరించారు. కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఎక్కువగా మంత్రులే కనిపించేవారు. పేపర్ యాడ్ లలోనూ ఒక్కో దాంట్లో ఒక్కో మంత్రిని హైలెట్ చేసేవారు. ఏ అంశంపైనైనా సరే.. రేవంత్ మాట్లాడేటప్పుడు మంత్రులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పేవారు. మంత్రుల దృష్టికి ఎవరైనా ఏ సమస్యనైనా తీసుకెళ్తే.. ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామనేవారు. పథకాలకు చెందిన వివరాలు, అమలు తేదీల్లోనూ స్పష్టత ఉండేది. కొద్దికాలంగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ఒకరు నెలాఖరుకు అమలుచేస్తామంటే.. ఫలానా తేదీ అంటూ మరొకరు చెబుతున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఈక్రమంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతికి సన్న బియ్యం, రేషన్‌కార్డుల జారీ, రైతు భరోసా తదితర పథకాల అమలకు సంబంధించి ఎన్నో తేదీలు మారాయి. చివరకు అమలు దిశగా కార్యాచరణ జరుగుతున్నప్పటికీ ఆయా తేదీల ప్రకటన నేతల మధ్య సఖ్యత లేదని తెలియజేస్తోంది. దీనిపై కూడా సీఎల్పీలో రేవంత్ స్పందించినట్లు తెలుస్తోంది. ఎవరికి వారు స్టేట్ మెంట్లు ఇవ్వొద్దని సూచించినట్లు సమాచారం.
సీఎల్పీలో రేవంత్ వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి?
‘ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవకు రంధ్రం పడితే దాన్ని నడిపేవాడే కాదు.. అందులో కూర్చున్న వారు కూడా మునిగిపోతారు. అలాగే పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వమూ బలంగా ఉంటుంది. అందరం కలిసికట్టుగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది’’ అని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో అన్నట్లు తెలిసింది. ఎవరూ పార్టీ లైన్ దాటొద్దని, క్రమశిక్షణతో మెలగాలని.. సున్నితంగా హెచ్చరించినట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇక మీదట తరచుగా కలుస్తూ ఉందామని, సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. అలాగే ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలపై క్యాబినెట్ అనుమతి లేకుండా ఎవరూ అడ్డగోలు ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. సీఎల్పీలో రేవంత్ వ్యాఖ్యలు పార్టీలో క్రమశిక్షణ తప్పుతుందనే దానికి నిదర్శనమని ప్రచారం జరుగుతోంది.
కేబినెట్ భేటీలో..
అలాగే.. ఎస్సీవర్గీకరణ, కులగణనపై చర్చకు భేటీ సందర్భంగా కేబినెట్ లో మంత్రులు దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఉప కులాల సంఖ్యకు సంబంధించి వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాదు.. ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపుల్లో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో భట్టి స్పందిస్తూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారట. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో కూడా భేటీ అయ్యారు. ఆ భేటీలోనూ కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయ లేమిపై చర్చ వచ్చినట్లు తెలిసింది. సీఎల్పీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా తీశారట. ఆ విధంగా స్పందించాల్సి రావడం వెనుక కారణాలను అడిగి తెలుసుకున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. వీటన్నింటినీ గమనిస్తే.. కాంగ్రెస్ పడవలో కుదుపులు మొదలయ్యాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పడవ ప్రయాణం చిల్లు పడి మునుగుతుందా, నిధానంగానే సాగుతుందా.. అనేది వేచి చూడాలి.
………………………………………….