
* దేశంలో బీజేపీకి తిరుగే లేదా
* ఢిల్లీ పీఠం కైవసంతో చరిత్ర సృష్టించిన కాషాయ పార్టీ
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
మోదీ.. మోదీ.. మోదీ.. అంటూ 2014 ఎన్నికలకు ముందు దేశమంతా ఆ పేరు మార్మోగింది. చాయ్ వాలాగా, సామాన్యుడిగా అందరి మన్ననలూ పొందుతూ ఏకంగా ప్రధానమంత్రి అయిపోయారు నరేంద్ర దామోదర్దాస్ మోదీ. నాటి నుంచీ దేశంలో రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. పేరున్న పార్టీలు, తరతరాలుగా రాజకీయాన్ని ఏలుతున్న నాయకులూ చాలా మంది కనుమరుగైపోయారు. దశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లపాటు ఊసే లేకుండా పోయింది. నాటి నుంచీ మోదీ మెజారిటీ అప్రహతిహతంగా పెరుగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ పీఠం సైతం తన ఖాతాలో వేసుకుని ఇక తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. 70 స్థానాలు గల ఢిల్లీ అసెంబ్లీలో ఏకంగా 48 స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ సత్తా చాటింది. 2020లో 62 స్థానాల్లో గెలుపొందిన ఆప్ ఈసారి 40 సీట్లు కోల్పోయి.. 22కే పరిమితమైంది. కాంగ్రెస్ సంగతి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు.
గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆప్ ఓట్ల శాతం 10 తగ్గింది. బీజేపీ ఓట్ల వాటా 7 శాతం పెరిగింది. కాంగ్రెస్ కు 2 శాతం పెరిగినా ఒక్క సీటునూ పొందు లేకపోయింది. మొత్తంగా చూస్తే బీజేపీ హవా బాగా పెరిగిందనేది స్పష్టం అవుతోంది. దీని వెనుక మోదీ చరిష్మానే ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం. 2014లో ఎన్నికల్లో గెలుపుతో మార్పు కోసం ప్రజలు ఓట్లు వేశారని చాలా మంది భావించారు. అయితే.. మంచి మెజారిటీతో బీజేపీ గెలిచినా ఎన్డీఏ పేరుతోనే పాలన సాగించారు. అయినప్పటికీ, ఈసారి బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదని 2019 ఎన్నికల్లో కొన్ని విశ్లేషణలు వెలువడ్డాయి. ఈక్రమంలో కొన్ని పార్టీలు ఎన్డీఏ నుంచి కాంగ్రెస్ గూటికి చేరాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబునాయుడు కూడా నాడు మోదీతో తెగదెంపులు చేసుకున్నారు. తీరా ఎన్నికల అనంతరం ఫలితాలను చూస్తే.. విపక్షాలకు తీవ్ర షాక్ తగిలింది. కాంగ్రెస్ అయితే నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. 2014తో పోలిస్తే ఎక్కువ మెజారిటీతోనే 2019లో మళ్లీ ఎన్డీఏనే గద్దెనెక్కింది.
రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ నిర్ణయం వల్ల దేశం వెనక్కి వెళ్లిపోయిందన్న ప్రచారం జరిగింది. నల్లధనం అరికట్టడానికే నంటూ 500, 1000 నోట్లను రద్దు చేసిన మోదీ సర్కారు.. 2000 నోటును తీసుకురావడం విమర్శలను తెచ్చిపెట్టింది. ఈనేపథ్యంలో ఇక నరేంద్ర మోదీకి పరాజయం తప్పదని ప్రచారం జరిగింది. దీనికితోడు.. రెండు సార్లు వరుసగా అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా వ్యతిరేకత ఉంటుంది. దీంతో ఓడిపోవడమో, అత్తెసరు సీట్లతో నెగ్గుకురావడమో ఉంటుంది. కానీ మోదీ విషయంలో మేజిక్ జరిగింది. మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి మంచి మెజారిటీతోనే అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు నెలలకే హర్యానా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. హర్యానాలో బీజేపీకి చాన్సే లేదని అక్కడ అధికార వ్యతిరేకత కొండంత పేరుకుపోయిందని దానికి ఏ మోదీ మ్యాజిక్ కూడా విరుగుడు కాదని సర్వే సంస్థలన్నీ ముక్త కంఠంతో చెప్పాయి. వాటిని పటాపంచలు చేస్తూ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయదుందుభి మోగించింది. సుదీర్ఘకాలం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాషాయజెండా రెపరెపలాడింది. వీటన్నింటినీ పరిశీలిస్తే.. రాజకీయంగా మోదీకి ఇప్పట్లో ఢోకా లేదని అర్థం అవుతోంది.
…………………………………………