![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-37.jpg)
* సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: చిన్నజీతాలతో జీవితాలు నెట్టుకొచ్చే వారికి 12 రోజులు గడుస్తున్నా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోంగార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని అన్నారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు చేతిలో చిల్లిగవ్వలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి ఉందని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని ధ్వజమెత్తారు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీరికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు పెడుతున్నారని విమర్శించారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అని ఆక్షేపించారు. హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
………………………………….