
* రెండు, మూడూ కాదు.. ఏకంగా 350
* వాటి గోల భరించలేక అధికారులకు ఫిర్యాదు
* 48 గంటల్లో తరలించాలని యజమానికి నోటీసులు
ఆకేరు న్యూస్, డెస్క్ : కొంతమంది జంతు ప్రేమికులకు శునకాలు, పిల్లులపై అమితమైన ప్రేమ ఉంటుంది. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటారు. కుటుంబసభ్యులుగానే భావిస్తారు. ఆహారం, ఆరోగ్యం విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వాటికి కష్టం వస్తే విలవిలలాడిపోతారు. అయితే, సాధారణంగా ఎవరైనా ఒకటో.., రెండో.. మరీ లేదంటే మూడో.. శునకాలను లేదా పిల్లులను ఇంట్లో పెంచుకుంటారు. కానీ, ఒక మహిళ తన త్రిఫుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లో ఏకంగా 350 పిల్లులను పెంచుతోంది. తొలుత తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ, మెల్లమెల్లగా సంఖ్యను పెంచేసింది. పిల్లులపై ఆమెకున్న ప్రేమ మాటేమిటోకానీ, వాటి అరుపులకు పక్కింట్టోళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఎక్కడ.. ఏమిటీ అంటే..
పుణె హడప్సర్ ప్రాంతంలోని మార్వెల్ బౌంటీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని ఓ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఓ మహిళ నివసిస్తోంది. ఆమెకు పిల్లులు అంటే విపరీతమైన ఇష్టం. ఇష్టానికైనా హద్దులు ఉండాలి. కానీ ఆమె ఇష్టానికి హద్దులు లేవు. దీంతో ఏకంగా ఫ్లాట్ లోనే 350కిపైగా పిల్లులను పెంచుకుంటోంది. ఒకటి, రెండు పిల్లులు ఏకధాటిగా అరిస్తేనే ఎలా ఉంటుందో చాలా మందికి పరిచయమే ఉంటుంది. అలాంటిది 350 పిల్లుల అరుపులతో ఆ సొసైటీ దద్దరిలిల్లేది. దీంతో వారు పిల్లులు పెంచుతున్న మహిళపై మున్సిపల్ కార్పొరేషన్లోను, పోలీసులకు ఫిర్యాదు చేశారు. “ఆ ఫ్లాట్లో ఉన్న 350కి పైగా పిల్లులsy పరిసర ప్రాంతాల్లో భయంకరమైన దుర్వాసన వస్తోంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఈ పిల్లులు చాలా పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. వాటిని చూసి అపార్ట్మెంట్లలో ఉన్న చిన్నారులు భయపడుతున్నారు.” అని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు ఆ ఇంటిని పరిశీలించి, సదరు మహిళకు నోటీసు ఇచ్చారు. 48 గంటల్లోపు ఈ పిల్లులను ఫ్లాట్ నుంచి పంపేయాలని తెలిపారు. లేదంటే అధికారులే పిల్లులను తొలగిస్తారని పేర్కొన్నారు.
……………………………………….