
ఆకేరు న్యూస్, డెస్క్ : కెనడాలో రన్‌వే పై విమానం బోల్తా పడింది. ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 76 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. 18 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిలో ఓ చిన్నారి సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టొరంటో(Toronto)లో విమానం ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి తలకిందులుగా బోల్తా పడింది. అమెరికా(America)లోని మిన్నెపొలిస్ నుంచి బయల్దేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ (Delta Airlines)విమానం పియర్సన్ విమానాశ్రయ రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టంగా మంచు పేరుకుపోయిన రన్‌వేపై విమానం జారుతూ బోల్తాపడింది. ప్రమాదం కారణంగా విమానంలో మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపుచేశారు. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral)గా మారాయి. ఘటనకు గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
………………………………….