
* మాయగాళ్ల వలలో పడొద్దు
* 45 రోజుల్లో 380కు పైగా ఫిర్యాదులు
* 90 కోట్లను దోచేశారు..
* వెలుగులోకి వచ్చినవి ఇవీ.. రానివి ఎన్నో
* ఆ కాల్ కట్ చేయండి.. 1930కు కాల్ చేయండి..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌పై సైబర్ నేరగాళ్ల కన్ను పొంచి ఉంది. దేశంలోనే సైబర్ నేరాలు ఎక్కువగా ఇక్కడే జరుగుతున్నట్లు అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిషు.. మూడు భాషలూ తెలిసిన వారే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు నూతన మార్గాలను ఎంచుకుంటున్న క్రిమినల్స్ కొందరికి అందం ఎరతో, మరికొందరికి డిజిటల్ అరెస్ట్ పేరుతో కాల్స్ చేసి బెదిరించి దోచుకుంటున్నారు. గతేడాదిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు వేలకు పైగా సైబర్ నేరాల్లో రూ.205 కోట్ల వరకు దోచుకోగా, ఈ ఏడాదిలో 45 రోజుల్లోనే 380కుపైగా కేసుల్లో 90 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన షీల్డ్-2025 సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెరుగుతున్న సైబర్ నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. నేరగాళ్లు ఎక్కడో ఉండి.. నగరంలో ఉన్న మన డబ్బు కొట్టేస్తున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రూటు మార్చి.. అమాయకులను ఏమార్చి..
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, ఉద్యోగ అవకాశాల పేరుతో ఆశలు పెంచి.., నమ్మించి మోసం చేసే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు రూటుమార్చుతున్నారు. సరికొత్త మార్గాల్లో దోచుకుంటున్నారు. అరెస్టుల పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫెడెక్స్, న్యూడ్ కాల్స్ మోసాల్లో సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. అందమైన అమ్మాయిలతో వీడియో కాల్స్ చేయించి అవతలి వారిని టెంప్ట్ చేస్తున్నారు. ఆ కాల్‌ను రికార్డ్ చేసి న్యూడ్ వీడియోలు, ఫొటోలను సన్నిహితులకు పంపిస్తామని బెదిరించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు.
రిటైర్డ్ ఉద్యోగికి ఫోన్..
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఫోన్ చేసిన దుండగులు మీ పేరుతో ఉన్న పార్సిల్లో డ్రగ్స్, బ్యాంకు పాస్‌బుక్‌లు లభ్యమయ్యాయని చెప్పారు. పోలీస్ దుస్తులు ధరించిన వ్యక్తి స్కైప్ కాల్ చేసి ముంబై క్రైం బ్రాంచ్ అధికారిగా పరిచయం చేసుకుని విచారణ చేపడుతున్నట్లుగా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎన్డీపీఎస్, మనీ ల్యాండరింగ్ కేసులు నమోదయ్యాయని, ఏక్షణంలోనైనా అరెస్ట్ కావొచ్చని బెదిరించి రూ. 20 లక్షలు లూటీ చేశాడు. వెలుగులోకి కొన్ని కేసులు మాత్రమే వస్తుండగా, భయపడి ఫిర్యాదు చేయని బాధితులు ఇంకా చాలా మందే ఉంటున్నారు.
45 నుంచి 70 ఏళ్ల వారు…
పార్సిల్ మోసాల్లో సైబర్ నేరగాళ్లు దర్యాప్తు సంస్థల పేరుతో ఫోన్, స్కైప్ కాల్స్ చేసి భయపెడుతున్నారు. కేసుల నుంచి తప్పిస్తామని, ఖాతాలో డబ్బును స్ర్కీనింగ్ చేయాలని చెప్పి నగదు లూటీ చేస్తున్నారు. మోసగాళ్ల చేతిలో డబ్బు పోగొట్టుకుంటున్న వారిలో 45 నుంచి 70 ఏళ్ల వారు ఎక్కువగా ఉంటున్నారు. బాఽధితుల్లో మహిళల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. హైదరాబాద్‌కు చెందిన మహిళకు సైబర్ నేరగాళ్లు విదేశీ పోలీస్ అధికారులమంటూ ఫోన్ చేశారు. నేరం చేస్తుండగా విదేశాల్లో ఉన్న తన కుమార్తెను, ఆమె సహచరుడిని అరెస్ట్ చేశామని చెప్పారు. కేసు నుంచి బయటపడాలంటే తాము సూచించిన ఖాతాలకు డబ్బు జమ చేయాలని చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు.
కాల్ కట్ చేయండి.. 1930కు కాల్ చేయండి..
మనీల్యాండరింగ్, డ్రగ్స్, అరెస్ట్ అంటూ దర్యాప్తు సంస్థల అధికారులు వీడియో కాల్స్ చేయరు. ఒకవేళ ఎవరైనా దర్యాప్తు సంస్థల పేరుతో ఫోన్ చేస్తే వెంటనే కాల్ కట్‌చేసి పోలీసులకు సమాచారమివ్వాలి. ఒకవేళ సైబర్ నేరగాళ్లకు డబ్బులు చెల్లిస్తే వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇలా చేయడం వల్ల వారి ఖాతాలను ఫ్రీజ్ చేసి డబ్బును తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది.
……………………………………..