* అందుకే .. కాంగ్రెస్ పార్టీ లో చేరాను
* బీజేపీ పాలనలో మైనారిటీలు, దళితులపై ఆకృత్యాలు పెరిగాయి.
* పల్లా రాజేశ్వర్ రెడ్డిని బట్టలూడదీసి జనగాం చౌరాస్తాలో నిలబెడుతా.
*నాది గర్వం కాదు.. ఆత్మ గౌరవం .
* మందకృష్ణ దండోరా ముసుగు తొలగిస్తే మంచిది
– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, వరంగల్ : ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేం. నియోజకవర్గ అభివృద్ధి కుంటు పడుతుంది. అన్నిటికీ మించి ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పు గా పరిణమిస్తున్న బీజేపీ లాంటి నియంతృత్వ పార్టీ ని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీల శక్తి సరిపోదు. అందుకే జాతీయ పార్టీ లౌకిక వాద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే , మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హనుమకొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కుమార్తె, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కావ్యతో కలిసి మాట్లాడారు. స్టేషన్ ఘన్పూర్లో ఎన్నికల సమయంలో అభివృద్ధికి సంబందించి అనేక హామీలు ఇచ్చాం. కష్ట కాలంలో కూడా స్టేషన్ ఘన్పూర్ ప్రజలు నాతో ఉన్నారు. గత కొన్ని ఏళ్ళుగా నియోజకవర్గంలో అభివృద్ది కుంటుపడింది. నన్ను నమ్మి నాతో నడిచిన ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందని కడియం శ్రీహరి అన్నారు.
* బీజేపీ తో దేశానికి పెనుముప్పు.
పదేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది.
దేశంలో ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డి దారిన కూలగొట్టి లొంగ తీసుకొనేందుకు సీబీఐ, ఈడీ కేసులలో ఈడీ కేసులలో ఇరికించి పార్టీలను తమ వైపు తిప్పుకుంటోంది. విపక్షంలో ఉన్నప్పుడు నిందితుడుగా ఉన్న వ్యక్తి బీజేపీలో చేరగానే పునీతులు అయిపోతున్నారు. భారతదేశంలో ఉన్న ముస్లిం మైనార్టీలకు భద్రత లేదు. అందరినీ టెర్రరిస్టులుగా , పాకిస్తాన్ మధ్దతుదారులుగా ముద్ర వేసి కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు. పదేళ్ల కాలంలో దేశంలో దళితుల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. దళిత మహిళల మానభంగాలకు లెక్కే లేకుండా పోయింది. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఒక సంఘటన జరిగితే పోలీస్ స్టేషన్ వెళ్లి రిపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక మచ్చ లాంటిది మణిపూర్ అల్లర్లు . వందలాది చర్చీలను కాలబెట్టారు. రోడ్లపైన మహిళలను వివస్త్రలను చేశారు. దళిత క్రైస్తవులను ఊచకోత కోశారు. ప్రధానమంత్రి మోదిలో చలనం లేదు. ఈరోజు వరకు మణిపూర్ వెళ్ళి బాధితులను పరామర్శించే తీరికా, ఓపికా ప్రధానమంత్రికి లేదు. అన్నిటికంటే ప్రమాదకరమైన ధోరణి 400 సీట్లు బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంటున్నారు. రిజర్వేషన్లను ఎత్తి వేస్తాం. లౌకికవాదం అనే పదాన్ని తొలగిస్తామంటున్నారు. ఇలాంటి బీజేపీ ఆకృత్యాలను అడ్డుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందని కడియం శ్రీహరి వివరించారు.
* పల్లా రాజేశ్వర్ రెడ్డిని బట్టలూడదీసి జనగాం చౌరాస్తాలో నిలబెడుతా..
భారత రాష్ట్ర సమితిని వీడడం బాధగానే ఉంది. కేసిఆర్ పట్ల నాకు గౌరవం ఉంది . భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది. వాటిని సద్వినియోగం చేసుకుని జిల్లా ప్రజలకు సేవ చేశాను. ఎంతో మంది పార్టీలు మారుతున్నారు. నా పట్ల మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. నిన్నటి వరకు వారితోనే ఉన్నాను. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం మాట్లాడుతున్నాడో.. ఏ వేదిక మీద మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పాలకుర్తి నియోజకవర్గం లో పనులు చేస్తే మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావ్..దయాకర్ రావు ఇప్పటికైనా అహంకారపు మాటలు మానుకోవాలి.. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి నిప్పు తొక్కిన కోతిలాగా నా మీద ఎగిరి పడుతున్నడు. అభ్యంతరకరమైన భాషను ఉపయోగించి నా మీద అనేక ఆరోపణలు చేశాడు. అసలు భారత రాష్ట్ర సమితి ఈ దుస్థితికి రావడానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి చీడ పురుగులే కారణమన్నారు . నీ చరిత్ర అంత బయటపెడతా.. నీ దోపిడి అంతా బయట పెడతా.. అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడ దోపిడి చేశానో , నా చరిత్ర ఎంటో .. ఆధారాలతో బయట పెట్టక పోతే పల్లా రాజేశ్వర్ రెడ్డి ` బట్టలు ఊడదీసి జనగాం చౌరస్తాలో నిలబెడుతానని ` తీవ్ర స్థాయిలో కడియం శ్రీహరి హెచ్చరించారు. మానకొండూర్ నుంచి ఒకాయన మాట్లాడుతున్నడు.. ఇక్కడికి వచ్చి పండబెట్టి తొక్కుతడటా.. చావు డప్పు కొడతడటా.. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే 50 వేల ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయాడు. నా దగ్గరకు వచ్చేంత సీన్ లేదని రసమయి బాలకిషన్ పేరు ఉచ్చరించకుండానే కడియం శ్రీహరి హెచ్చరించారు.
* మంద కృష్ణా.. దండోరా ముసుగు తీసెయ్ ..
దండోరా ఉద్యమంతో నేను 30 సంవత్సరాలుగా మమేకం అయి ఉన్నాను. నేను లేకుండా దండోరా ఉద్యమం లేదు. దండోరా ఉద్యమానికి అన్ని రకాలుగా ఇప్పటికీ సహకారం చేస్తూనే ఉన్నాను. బీజేపీకి వత్తాసు పలుకుతున్న మందకృష్ణ దండోరా ముసుగు తీసేసి ఆ పార్టీలో చేరాలి. ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నది . తెలంగాణలో బీజేపీ వస్తే మతోన్మాదం పెరుగుతుంది. ఇప్పటి వరకు లేని కుల వ్యవస్థ మళ్ళీ వస్తుంది. దళితులపై దాడులు అత్యాచారాలు, చర్చీలను తగుల బెడుతూ మారణ హోమం సృష్టిస్తున్నబీజేపీకి ఏ విదంగా ఓటు వేయమని అడుగుతావని మంద కృష్ణను ప్రశ్నించారు.వర్గీకరణ పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ ని ఏవిదంగా నమ్ముతావన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయాలన్న చిత్తశుద్ది ఉంటే , పదేండ్లు బీజేపీ అదికారంలోనే ఉంది కదా ఎందుకు చేయలేదన్నారు . ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చేసే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదో అర్థం చేసుకోవాలన్నారు. నా మీద వ్యక్తిగత కోపం ఉంటే ఫర్వాలేదు. దళిత సమాజానికి వ్యతిరేకంగా మంద కృష్ణ బీజేపీ వైపు నిలబడుతున్నాడు.. ఆయనను దళిత ప్రజలు క్షమించరన్నారు. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు భ్రమపడొద్దన్నారు. మంద కృష్ణ తప్పుడు నిర్ణయాల వల్ల ఎమ్మార్పీఎస్ పది ముక్కలయిపోయింది. నేనెవరి అవకాశాలను దెబ్బతీయలేదు. అవకాశాలే నన్నువెతుక్కుంటూ వచ్చాయని కడియం శ్రీహరి చెప్పారు.
* గర్వం కాదు.. ఆత్మ గౌరవం .
నేను చిన్న కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి జిల్లా ప్రజల ఆశీర్వాదంతో ఎదిగాను.ఇదీ నా చివరి ఎన్నిక కావచ్చు. రాజకీయాల్లో ఉన్నంత వరకు నిజాయితీగా నే ఉంటానని ప్రజలకు హామి ఇస్తున్నానన్నారు. కొంత మంది నాకు నాకు గర్వం ఎక్కువ అని అనుకుంటారు. అదీ గర్వం కాదు. ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం.. తప్పు చేయనప్పడు ఎవరికీ తలవంచాల్సిన పని లేదని భావిస్తాను.. అహంకార పూరిత ఆలోచన ఉన్న వాళ్ళకు అదీ గర్వం లాగానే కనిపిస్తుందని కడియం శ్రీహరి అన్నారు. నా కూతురు కడియం కావ్యను సైతం నీతి, నిజాయితీతో పెంచాను. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ, పీసీసీ నేతలతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మల్యేలకు శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు.
———————————