
వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి కేంద్ర గ్రీన్ సిగ్నల్
* భారత్, చైనా యుద్ధ టైంలో కీలక సేవలు
* మళ్లీ విమాన రాకపోకలకు రన్ వే
* వరంగల్‌కు అనతికాలంలోనే రాజధాని కళ
* ఫలించిన స్థానిక ఎంపీ కడియం కావ్య కృషి
* కృత నిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ సర్కారు
* త్వరగా అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని, వరంగల్ నగరవాసులకే కాకుండా జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేలా, స్థానికంగా అభివృద్ధికి ఊతమిచ్చేలా అద్భుతమైన విమానాశ్రయాన్ని కూడా నిర్మిస్తామని గత నవంబర్లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మామునూరు విమానాశ్రయ భూ సేకరణ, ఇతర ప్రణాళికలపై చర్చించారు. ఎయిర్ పోర్ట్‌లో తొలి దశను డిసెంబరులోగా పూర్తి చేసి దేశీయ విమానాల రాకపోకలను ప్రారంభించేందుకు వేగంగా కసరత్తు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత కొచ్చి అంతర్జాతీయ విమానశ్రయాన్ని అధ్యయనం చేసి అక్కడి వసతులను ఇక్కడా అమలయ్యేలా చూడాలని చెప్పారు. విమానాశ్రయ ఏర్పాటుపై రాష్ట్రంలో సమీక్షలు జరపడమే కాకుండా, కేంద్రం నుంచి కూడా త్వరితగతిన అనుమతులు సాధించేలా కృషి చేశారు.
1981 వరకు విమాన సర్వీసులు
వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈక్రమంలో గతంలోనే మామునూరు నుంచి విమాన రాకపోకలు సాగించిన విషయం తెరపైకి వచ్చింది. వాస్తవానికి నిజాం కాలంలోనే ఎక్కడా లేని విధంగా సుమారు 1800 ఎకరాల సువిశాల స్థలంలో మామునూరు ఎయిర్ పోర్ట్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంతో పాటు వరంగల్ లో కూడా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దారు. 6.6 కిలోమీటర్ల రన్‌వేతో పైలెట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ మామునూరు ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు 1981 వరకు విమాన సర్వీసులు కొనసాగాయి. 2007 సంవత్సరంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడపలో విమానాశ్రయం ఏర్పాటు చేయడంతో మామునూరు ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే, రెండు విమానాశ్రయాలకు సమానంగా నిధులు కేటాయించాల్సిన అప్పటి వైయస్సార్ సర్కార్ కేవలం కడపకు మాత్రమే నిధులు కేటాయించింది. దీంతో మామునూరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మళ్లీ 44 ఏళ్ల తర్వాత వరంగల్ లో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు పనులు వేగం కానున్నాయి.
పనులు వేగవంతం
కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు కల సాకారమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఎయిర్‌పోర్టు పనులు వేగవంతమవుతాని ఆయన అన్నారు. ఎయిర్‌పోర్టుకు కేంద్రం అనుమతి తెలపడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో కొంత రన్‌వే విస్తరణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), టెర్మినల్ బిల్డింగ్, నేవిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ వివరించింది.
కడియం కావ్య చొరవ
వరంగల్ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరడం వెనుక వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కూడా ఉన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసారు. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అలాగే, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు కూడా లేఖలు అందజేశారు.
————————-