
తీన్మార్ మల్లన్న
* కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్
* క్రమశిక్షణా చర్యలు తీసుకున్న పార్టీ అధిష్ఠానం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)పై పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ (Congress)క్రమశిక్షణ సంఘం వివరణ కోరింది. దీనిపై మల్లన్న ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాల్సి ఉంది. గడువు తీరినా కూడా మల్లన్న స్పందించలేదు. పైగా.. కాంగ్రెస్ తీరు బీసీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ఉందని విమర్శించారు. రాహుల్ గాంధీ (RahulGandhi)బాటలో నడుస్తూ.. బీసీల గురించి మాట్లాడితే నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. నోటీసులకు స్పందించని కారణంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చిన మర్నాడే ఆయనపై వేటు పడడం గమనార్హం.
పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు
మల్లన్న సస్పెన్షన్పై టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Maheshkumar Goud) స్పందించారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారికి ఇది ఒక హెచ్చరిక అని ఆయన తెలిపారు. భవిష్యత్లో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.
—————–