* ఫలించిన రైతు న్యాయ పోరాటం
* భూ పరిహారం ఇవ్వడంలో రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం
* భూ సేకరణ, పునరావాస అథారిటీ సంచలన తీర్పు
ఆకేరు న్యూస్, వరంగల్ : రైతు న్యాయ పోరాటం ఫలించింది. రెవిన్యూ డివిజనల్ కార్యాలయం ( Warangal RDO ) లో అలజడి సృష్టించింది. భూ సేకరణ పేరుతో వ్యవసాయ భూమిని తీసుకుని ఫరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించారు . దీంతో ఆ రైతు న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు. పరిహారం వెంటనే చెల్లించాలని భూ సేకరణ, పునరావాస అథారిటీ ( The Land Acquisition , Rehabilitation and Resettlement Authority ) లేదంటే ఆస్తులు జప్తు చేయాల్సి వస్తుందని తీర్పు చెప్పింది. అయినప్పటికీ రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఆర్డీవో కార్యాలయంలోని ఆస్తులను సీజ్ చేశారు.
* అసలేం జరిగిందంటే..?
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో గత ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ పేరు ( Kakatiya Mega Textile Park ) తో ప్రతిష్టాత్మక ప్రాజెక్ఠ్ తలపెట్టింది. ఇందు కోసం వందల ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. అనివార్యమైన పరిస్థితుల్లో సాగు యోగ్యమైన భూములను ప్రభుత్వానికి అప్పగించారు. ఇదే మండలం శాయంపేట (Shayampet )కు చెందిన సముద్రాల యాక స్వామి ( Samudrala Yakaswamy ) కి సంబందించిన భూములను మొదటి దఫాలో తీసుకోలేదు. నాలుగేండ్ల తర్వాత సముద్రాల యాకస్వామి , వెన్నెల భూములు కూడా అప్పగించాలని అధికారులు పట్టుపట్టారు. సాగు చేసుకుంటున్నం .. అందులో ఇతర పంటలు వేశామని ఇప్పుడు భూములు ఇవ్వడం సాధ్యం కాదని అధికారులను ప్రాదేయపడ్డారు. ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు ఫలితం మాత్రం కానరాలేదు. తప్పని సరి పరిస్థితుల్లో భూములు ఇవ్వాల్సి వచ్చింది. నాలుగేండ్ల కింద ఎకరాకు ఇచ్చిన రూ 9 లక్షల 90 వేలు మాత్ర మే ఇస్తామన్నారు. దీంతో ఇదేం న్యాయం ఇపుడు బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ. 50 లక్షల ధర పలుకుతుంటే ఇంత తక్కువ ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. ఇదీ ప్రభుత్వ నిర్ణయం… ఏం చేసినా ఫలితం ఉండదు భూమి అప్పగించాల్సిందేనని అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో యాకస్వామి వరంగల్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది రామగిరి నాగేంద్రచారి ద్వారా న్యాయపోరాటానికి సిద్ద పడ్డారు. మా ఆదేశాలను కోర్టులో సవాల్ చేస్తే అందరికీ ఇచ్చిన దానికంటే లక్ష రూపాయలు తక్కువగా అంటే రూ. 8 లక్షల 90 వేల చొప్పున మాత్రమే ఇస్తామన్నారు. నాలుగేండ్ల తర్వాత కూడా గతంలో ఇచ్చిన ధర కాకుండా రెట్టింపు ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. మొత్తం రూ. 2 కోట్ల 40 లక్షలు చెల్లించాలని న్యాయ స్థానం 2023 మే నెలలోనే ఆదేశించింది. 11 నెలలు అయినప్పటికీ కూడా చెల్లించడానికి రెవిన్యూ అధికారులు సిద్దపడలేదు. ఎన్నో సార్లు కోర్టు నుంచి నోటీస్‌లు వచ్చినప్పటికీ అధికారులు స్పందించక పోవడంతో గురువారం న్యాయ స్థానం ( LARRA ) ప్రతినిధులు వరంగల్ ఆర్డీవో కార్యాలయం చేరుకున్నారు. అందులోని ఆస్తులను సీజ్ చేశారు. ఆర్డీవో కార్యాలయం లోని కంప్యూటర్లు, ఫర్నీచర్, కలర్ టీవీ, కారు, కూలర్, ఫ్యాన్లు తదితర వస్తువులను సీజ్ చేశారు.
* అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
సముద్రాల యాకస్వామి, రైతు , శాయంపేట .
అన్యాయంగా నా భూమిని లాక్కోవడమే కాకుండా న్యాయమైన ధర కూడా చెల్లించలేదు. మాది రైతు కుటుంబం . తరతరాలుగా వ్యవసాయాన్నే నమ్ముకున్నాం. టెక్స్టైల్ పార్క్ సంగతేమో కాని చుట్టుపక్కల రైతుల భూములన్నీ లాక్కున్నారు. పంట పొలాలు కూడా అప్పగించాల్సి వచ్చింది. అధికారుల చుట్టూ తిరిగి బ్రతిమిలాడాను. పట్టించుకోలేదు.నన్ను ఒకపురుగులాగా చూశారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదు. చివరకు ఆర్డీవో కార్యాలయ ఆస్తులను సీజ్ చేసే వరకు వచ్చింది. అయినా కూడా వెంటనే అధికారులు స్పందిస్తారన్న నమ్మకం లేదు. ఈ నెల 10 వ తేదీన అధికారులు న్యాయ స్థానంలో హాజరు కావాల్సి ఉంది. నా లాంటి బాధితులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నా..
—————————–