
* రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
* వైరా మండలం పుణ్యపురంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
ఆకేరున్యూస్, ఖమ్మం: ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు ఏర్పడకుండా గ్రీన్ ఛానల్ లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.మంగళవారం మంత్రి, వైరా మండలం పుణ్యపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేసి, ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులైన దంపతులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా లిమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూలి 10 సంవత్సరాలు గత ప్రభుత్వ హయాంలో ప్రజలు పడిన ఇబ్బందులు గమనించి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించాలనే లక్ష్యంతో 4 లక్షల 50 వేల ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేశామని అన్నారు.ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు అదనపు ఇండ్లు మంజూరు సైతం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పేదలకు 4 విడతల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో సొంత ఇండ్లు అందించే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని జనవరి 26న రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఒక పైలెట్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని అన్నారు. పుణ్యపురం గ్రామంలో 5 కోట్ల 50 లక్షల రూపాయల ఖర్చుతో 108 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసుకొని, నేడు నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని అన్నారు. గతంలో 2004 నుంచి 2014 మధ్యలో సుమారు 23 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టించామని అన్నారు. ఇంటిలో నివసించే ప్రజలే నిర్మాణం చేసుకునేలా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇంటి నిర్మాణానికి ఎటువంటి నిబంధనలు లేవని మంత్రి తెలిపారు. పేదలకు 4 విడతలలో ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సహాయం అందుతుందని, ఫౌండేషన్ వేసిన తర్వాత లక్ష రూపాయలు, కిటికిలు వేసిన తర్వాత లక్ష పాతిక వేలు, స్లాబ్ దశ చేరిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు, ఇండ్లు పూర్తి చేసిన తర్వాత మరో లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల సహాయం పేదలకు ఇంటి కోసం అందుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్న గ్రీన్ ఛానల్ లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.
రైతులందరికీ తప్పనిసరిగా రైతు భరోసా నిధులు అందుతాయి..
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే సారి 21 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని అన్నారు. మార్చి చివరి నాటికి రైతులందరికీ తప్పనిసరిగా రైతు భరోసా నిధులు అందుతాయని మంత్రి తెలిపారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచితంగా బస్సులలో ప్రయాణం వంటి పథకాలను అమలు చేశామని మంత్రి గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు దేశంలో ఎక్కడా లేనివిధంగా మొదటి సంవత్సరంలోనే 56 వేల ఉద్యోగాలను కల్పించామని అన్నారు. గత ప్రభుత్వం పెండిరగ్ లో పెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను సైతం పూర్తి చేసి పేదలకు అందిస్తున్నామని తెలిపారు. వివిధ కారణాలు చూపి ప్రజలకు ఇండ్లు ఎగ్గొట్టే ఉద్దేశం ప్రజా ప్రభుత్వానికి లేదని, రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు నిర్మించాలని ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పేదలకు రాజకీయ పార్టీలు, కుల మతాలకతీతంగా అర్హులకు ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ధరణి రద్దు చేసి భూ భారతి చట్టం తీసుకొని వచ్చామని, 11 వేల 600 కోట్లతో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా సమీకృత గురుకులం నిర్మాణం చేపడుతున్నామని, మన వైరా నియోజకవర్గంలో కూడా 200 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో పిల్లల కోసం పాఠశాల నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు.గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు భారీగా పెంచామని అన్నారు. గతంలో ప్రభుత్వాలు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, పేదల శ్రేయస్సు కోసం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఆశీస్సులు అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు స్థానికంగా ఇసుక తెచ్చుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు పెట్టవద్దని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పెట్టుబడి పెట్టలేని వారికి మహిళ సంఘాల ద్వారా సాధారణ వడ్డీకి లక్ష రూపాయల రుణం ఇప్పించేందుకు కలెక్టర్ తీసుకున్న చర్యలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల గురించి మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, కేవలం ఒక ఇంటిగా కాకుండా కుటుంబం ఆశలు దీనిపై ఉంటాయని గుర్తుంచుకొని పని చేయాలని మంత్రి ఆదేశించారని తెలిపారు. సొంత ఇల్లు ఉంటే కుటుంబ అభివృద్ధికి పునాదిలా పని చేస్తుందని, పిల్లల చదువు, మహిళల ఆర్థిక స్థిరత్వానికి ఉపయోగపడుతుందని అన్నారు.మన సొంత ఇండ్లు నిర్మించుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో, అంతే జాగ్రత్తగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని కలెక్టర్ తెలిపారు. గత 2 నెలల నుంచి లబ్దిదారులకు, మేస్త్రీలకు పలు దఫాలుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై శిక్షణ కార్యక్రమాలు అందించామని, ప్రభుత్వం అందించిన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ నాణ్యమైన ఇండ్లను నిర్మించాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో మనకు ఇచ్చిన లక్ష్యం మేరకు 3 వేల ఇండ్ల మార్కింగ్ పూర్తి చేశామని, ప్రతి లబ్దిదారుడు , మేస్త్రీతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వాడుకుంటూ సొంతింటి కలను నిజం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు సొంత ఇల్లు అందిస్తున్నామని అన్నారు. ప్రజలు ఇచ్చిన శక్తితో సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు వైరా మండలంలో ఈశాన్యం వైపు ఉన్న పుణ్యపురం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసుకున్నామని తెలిపారు. పుణ్యపురం గ్రామంలో దాదాపు 108 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసుకున్నామని తెలిపారు. కోటి 70 లక్షల రూపాయలతో సిరిపురం నుంచి పుణ్యవరం వరకు రోడ్డు మంజూరు చేసామని, అదేవిధంగా గ్రామంలో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. రైతు భరోసా క్రింద గ్రామంలో 511 మంది రైతులకు అధికారులు 66 లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు అందించామని అన్నారు. మన గ్రామంలో 149 మంది రైతులకు కోటి 34 లక్షల వరకు రుణమాఫీ జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
…………………………………………………………………