
* సీఎం ఆదేశాలతో మరింత చురుగ్గా సహాయక చర్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎస్ ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ గుర్తించేందుకు 33 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఫిబ్రవరి 22న టన్నెల్ నందు ప్రమాదం జరిగింది. ఎనిమిది మంది కార్మికులు, ఇంజనీర్లు, మిషన్ ఆపరేటర్లు టన్నెల్ లోనే చిక్కుకుపోయారు. వారికోసం కేంద్ర రాష్ట్ర సంస్థలకు చెందిన అనేక విభాగాల రెస్క్యూ సిబ్బంది రాత్రింబవళ్లు మూడు షిఫ్టులుగా అన్వేషణ చేస్తున్నారు. 8 మందిలో 16వ రోజు గురుపత్ సింగ్ మృతదేహం లభ్యం కాగా బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన ఏడుగురి కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు రెండో కార్మికుడి మృతదేహం కనిపించింది. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel) నందు టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్‌కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. టన్నెల్ నందు మినీ జెసిపి ద్వారా శిథిలాలు తొలగించడం, మట్టి బురదను బయటకు పంపడం సహాయక చర్యలు కొనసాగుతుండగా శిథిలాల కింద మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. అట్టి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉండడం, ఆ ప్రదేశం భరించలేని దుర్వాసన వస్తుండడంతో మిగిలిన ఆరుగురి మృతదేహాలు కూడా అదే ప్రదేశంలో ఉండే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రాజెక్టు ఇంజినీర్ మనోజ్ కుమార్‌గా గుర్తించారు. సహాయక చర్యలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthreddy)అధికారులతో చర్చించారు. అందరి ఆచూకీ గుర్తించే వరకూ అన్వేషణ కొనసాగించాల్సిందే అని ఆదేశించారు.
……………………………………..