
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
* కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
* డబ్బుల కోసం ప్రముఖులను బెదిరించేందుకే..
ఆకేరున్యూస్, హైదరాబాద్:
తెలంగాణలో సంచలన రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ పర్యవేక్షణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. సినీ నటులు, వ్యాపారులు, ప్రముఖులను బెదిరించి డబ్బు వసూళ్లు చేసేందుకు కేసీఆర్ ఈ నీచానికి పాల్పడ్డారని అన్నారు. బీజేపీ పోటీ చేసిన దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికలపై ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిఘా పెట్టి బీజేపీ భవిష్యత్‌ను దెబ్బతీసేందుకు, తమ పార్టీ నాయకులను బెదిరించేందుకు కేసీఆర్ ప్రయత్నించారని అన్నారు. కేసీఆర్ ఆదేశాలతో పోలీసు జీపుల్లోనే పోలీసులు డబ్బు తరలించారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై లోకల్ దర్యాప్తు సరిపోదని, ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ నుంచి ఢిల్లీకి వేల కోట్లు
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కిషన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కౌంటర్లు వేశారు. రాష్ట్రంలో దొంగలు పోయి గజదొంగలు వచ్చారని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఢిల్లీకి వేల కోట్ల రూపాయలను తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేని రేవంత్ రెడ్డి.. ప్రజలను ఏ ముఖంతో ఓట్లు అడుగుతారని ఎద్దేవా చేశారు. మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
——————-