* విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పది పరీక్షలు రాయాలి
జిల్లా విద్యాశాఖ అధికారి – సిద్ధార్థ రెడ్డి.
ఆకేరు న్యూస్, ములుగు:
జిల్లావ్యాప్తంగా పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ములుగు ఏ. సిద్ధార్థ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి 20 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 20 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు నియమించమని తెలిపారు. జిల్లాలో మూడు సి-సెంటర్లు ఉండగా వాటికి ప్రత్యేకంగా సి-సెంటర్ కస్టోడియన్లు నియమించామని వివరించారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి హాల్ టికెట్ మినహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు తెలిపారు.
జిల్లాలో మొత్తం 3290 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో త్రాగునీటి వసతి, అవసరమైన వైద్య సౌకర్యం, పరీక్షా గదుల్లో తగినంత వెలుతురు, గాలి ఉండేలా చర్యలు తీసుకోవాలని సెంటర్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు జూమ్ మీటింగ్ ద్వారా సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.
విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే సమయంలో అవసరంలేని వస్తువులు తీసుకువస్తే, పరీక్షా కేంద్రం బయట ఏర్పాటు చేసిన క్లాక్ రూమ్‌లో భద్రపరచుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకురావాలని, ఒకవేళ హాల్ టికెట్ పోయినట్లయితే ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌ను కూడా అంగీకరిస్తామని తెలిపారు.
పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లయితే నిబంధనల మేరకు చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
