* గుండెపోటుతో కన్నుమూత
ఆకేరున్యూస్, హైదరాబాద్: పద్మశ్రీ వనజీవి రామయ్య ఇకలేరు. ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ప్రకృతి ప్రేమికుడిగా గుర్తింపు పొందిన రామయ్య.. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. రామయ్య చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ ప్రకటించింది.
ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా..
ఇయన అసలు పేరు దరిపల్లి రామయ్య. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించారు. ప్రకృతి ప్రేమికుడైన ఆయన కోటకి ిపైగా మొక్కలు నాటారు. దీంతో ఆయన పేరు వనజీవి రామయ్యగా మారిపోయింది. ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందారు. రామయ్యతో పాటు ఆయన భార్య జానమ్మ కూడా ఆయనకు తోడ్పాటునిచ్చేది. ఐదు దశాబ్దాలకు పైగా సామాజిక అడవుల పెంపకం కోసం నిరంతరం పని చేస్తూ వచ్చారు. మానవ శ్రేయస్సుకు విత్తనమే పరిష్కారం అని రామయ్య బలంగా నమ్మేవాడు. ప్రకృతి పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఆకాంక్షించేవారు. ప్రకృతిని రక్షించండంటూ ఎన్నో వేదికల నుంచి పిలుపునిచ్చారు. కోటిపైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించిన రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు. రామయ్యను కడసారి చూడటానికి రెడ్డిపల్లిలోని ఆయన ఇంటికి తరలివెళ్తున్నారు.
సీఎం రేవంత్ సంతాపం..
పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేశారు. వారి మరణం సమాజానికి తీరని లోటని.. కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేశారు. పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య ఆత్మకు నివాళి. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
……………………………………
