
– 1994లో పోరాటం ప్రారంభించినప్పుడు ఎంతోమంది చులకనగా చూసారు
– ఎస్సీ వర్గీకరణకై పోరాటం చేసి నేలరాలిన ఉద్యమకారులకు ఈ విజయం అంకితం
– పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ఎమ్మార్పీఎస్ 30 ఏండ్లు ధృడ సంకల్పంతో పోరాటం చేసి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును సాధించామని పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణకై,జాతి అభ్యున్నతికై దశాబ్దాల సేవను గౌరవిస్తూ,పుల్ల ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకి ఆత్మీయ సన్మానం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన మందకృష్ణ మాదిగకి పుల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, మంద కృష్ణమాదిగ ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రధానమంత్రి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫీడవిట్ కారణంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఎమ్మార్పీఎస్ మద్దతు తీసుకున్నయని, ఇచ్చిన మాటకు కొన్ని రాజకీయ పార్టీలే కట్టుబడి ఉన్నాయనీ, కొన్ని పార్టీలు విస్మరిస్తూ మోసం చేస్తూ వచ్చిన కూడా దృఢ సంకల్పంతో ఎస్సీ వర్గీకరణ విజయాన్ని దక్కించుకున్నదని ఆయన అన్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది నాయకులు, నాయకురాళ్ళు అలుపెరుగని పోరాటం చేసి నేలకొరిగారని వారి త్యాగాల ఫలితంగానే ఈ విజయం సిద్ధించిందని, ఎస్సీ వర్గీకరణ విజయం వారికే అంకితం అని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ పోరాటంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ శ్రేణులతో పాటు , అన్ని వర్గాలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమానికి ఎంతో మద్దతు ఇచ్చాయని వారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని అన్నారు.అణగారిన వర్గాల కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి, తనను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గుర్తించిందని ఆయన అన్నారు.అనంతరం కమలాపూర్ లోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్మాన కార్యక్రమాల్లో పుల్ల కుటుంబ సభ్యులు మందకృష్ణ మాదిగను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ విఠల్, ఎపూరి సోమన్న,వరంగల్ శ్రీనివాస్,మిట్టపల్లి సురేందర్,పుల్ల రామస్వామి, డాక్టర్ పుల్ల కుమారస్వామి,రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పుల్ల సంజీవ్ రావ్,శ్రీనివాస్,సుభాష్,రాజేష్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………..