* కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ!!
ఆకేరు న్యూస్, డేస్క్: విద్యార్థి నేతల కిడ్నాప్ వ్యవహారంలో ప్రముఖ నటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ మంచు మోహన్‌బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, విచారణ పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్‌బాబు కోరారు. అయితే, ప్రస్తుత దశలో అటువంటి ఊరట ఇవ్వలేమని జస్టిస్ వెంకట జ్యోతిర్మయి స్పష్టం చేశారు. కిడ్నాప్ ఘటన జరిగిన సమయంలో మోహన్‌బాబు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన యూనివర్సిటీ పీఆర్వో సతీశ్‌తో ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ సంభాషణలకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో లోతైన విచారణ అవసరమని భావించిన హైకోర్టు, తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఈ కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
