
* హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
* ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష
ఆకేరున్యూస్, హన్మకొండ: హనుమకొండ జిల్లాలో ఐకెపి, పిఎసిఎస్ల ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం ఐకెపి, పీఏసీఎస్ ల ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన అంశాలపై పౌర సరఫరాలు, డీఆర్డీఏ, సహకార, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరిపోను గన్నీ బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా, ఎక్కడైనా ధాన్యం తడిసిందా, టార్పాలిన్లు సరిపోను ఉన్నాయా, ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో పేమెంట్ జరుగుతుందా అని సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రానున్న రోజుల్లో ఎంత ధాన్యం రానుందో అధికారులు అంచనా తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం తరలింపులో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, డీపీఎం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….