
– పార్టీల్లో విదేశీ మద్యం, గంజాయి
– కొన్నిచోట్ల డ్రగ్స్ కూడా..
– రిసార్టుల్లో వేడుకలు
– మందులో మునుగుతున్న పార్టీప్రియులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
పార్టీ అంటే మందు, గంజాయి, డ్రగ్స్ ఉండాల్సిందేనా? అంటే అవును అన్నట్లుగానే ఉంది కొందరి తీరు. శివార్లలో జరుగుతున్న చాలా పార్టీల్లో మద్యం ఏరులై పారుతోంది. గంజాయి మత్తులో చాలా మంది జోగుతున్నారు. కొందరైతే మరీ హద్దులు దాటి డ్రగ్స్ కూడా వినియోగిస్తున్నారు. పార్టీల పేరిట మత్తులో ముంచేస్తున్నారు. మద్యం ప్రియులు విదేశీ మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ పోలీసులు తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారం ఉంటామంటే, లాఠీలు ఝులిపించాల్సి ఉంటుందని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
విస్తరిస్తున్న మాదకద్రవ్యాల రవాణ
గంజాయి, డ్రగ్స్ ఎక్కడపడితే అక్కడ దొరుకేస్తున్నాయి. పోలీసుల కళ్లు ఈజీగా రవాణ చేసేస్తున్నారు. యువతే లక్ష్యంగా పెట్టుకున్న కొంతమంది విక్రయదారులు యదేచ్ఛగా డ్రగ్స్, గంజాయిని అమ్ముతున్నారు. ఒకప్పుడు ఢిల్లీ, ముంబై,గోవా లాంటి మహా నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్ కి విపరీతంగా విస్తరించింది. తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాలు అనే మాట వినిపించకుండా కట్టడి చేయాలని ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్న ఏదో ఒక మూల నుంచి మాదకద్రవ్యాలు నగరానికి చేరుకుంటునే ఉన్నాయి. డ్రగ్స్ డీలర్ల ద్వారా నగరానికి చేరుకుంటున్నాయి. అనంతరం పబ్బుల్లోకి, పార్టీలలోకి చెర వేస్తున్నారు. ఇక కాలేజికి వెళ్లే యువతకి డబ్బు ఆశ చూపి మాదకద్రవ్యాల మత్తులో మునిగిపోయేలా చేస్తున్నారు.
అవి కాకపోతే గంజాయి..
తెలంగాణలో గుడుంబా అమ్మకాలను నిషేధించడంతో గంజాయి అమ్మకాలకు తెర లేపుతున్నారు వ్యాపారులు. వైజాగ్, ఒడిశా ప్రాంతాల నుంచి తరలిస్తున్న దళారుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్లోని దూల్పేట్, మంగల్ హాట్, ఫలక్నూమా, పురాణ పూల్ తో పాటు మరికొన్ని స్లం ఏరియాలలో చిన్న చిన్న ప్యాకెట్లలలో తయారు చేసిన గంజాయిని అమ్ముతున్నారు. 10 గ్రాముల గంజాయి ప్యాకెట్ ఏకంగా వంద రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. డబ్బులు సులభంగా సంపాదించడం కోసం యువత క్యారియర్లుగా పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నగర శివారులో కొన్ని వందల కేజీల మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. కాపు కాసి మరి వాహనాలను పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ యథేచ్ఛగా దొరికేస్తుండడంతో కొన్ని పార్టీల్లోకి కూడా ఇవి వచ్చి చేరిపోతున్నాయి.
………………………………………………….