
* హైదరాబాద్‌కు చేరుకున్న వరంగల్ కాంగ్రెస్ నేతలు
* కొండా దంపతులపై చర్యలకు డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వరంగల్ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్‌ను కలవనున్నారు. కొండా (Konda) దంపతులపై ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవలే కొండాకు వ్యతిరేకంగా వరంగల్ (Warangal) లో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఈరోజు మీనాక్షి ముందు పంచాయితీ పెట్టనున్నారు. మీనాక్షి నటరాజన్ తో సమావేశం అనంతరం కొండా దంపతులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనే దాన్ని బట్టి ఎమ్మెల్యేల తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. “వరంగల్‌లో కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించారు. ఆ పార్టీని భ్రష్టు పట్టించారు. ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్‌ల వద్దకు చేరి వారిని కూడా తప్పుదోవ పట్టించి, నాశనం చేశారు” అని కొండా మురళి (Konda Murali) ఇటీవల వ్యాఖ్యానించారు. వారిలో ఒకరు గతంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అంతేకాకుండా, “పరకాలలో 75 ఏళ్ల నాయకుడొకరు నా దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే వచ్చేసారి మీకు వదిలేస్తానని చెప్పారు” అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి నుంచీ కొండా మురళి చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీలో అలజడి రేగుతోంది. వరుస సమావేశాలు నిర్వహిస్తూ వరంగల్ కాంగ్రెస్ నేతలు కొండా దంపతులపై చర్యలకు పట్టుబడుతున్నారు.
———————————–