* పిఠాపురం బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి..
* అక్కడ కూటమి నుంచి బరిలో పవన్ కల్యాణ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ పర్వంలో కొన్ని అంశాలు ఆసక్తిగా మారాయి. అలాంటిదిలో ఒకటి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ఓ ఆటో డ్రైవర్ నామినేషన్ వేయడం. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలు ప్రధానంగా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధిగా దానం నాగేందర్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇదే స్థానం నుంచి ఓ ఆటో డ్రైవర్ సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయడం చర్చనీయాంశం అయింది.
అక్కడ సమోసా వాలా.. ఇక్కడ ఆటోవాలా
ఎన్నికల్లో సామాన్యులు నామినేషన్లు వేయడం తెలిసిందే. కూలీ చేసుకునే వాళ్లు, రైతులు, బిచ్చగాళ్లు కూడా కొన్ని ఎన్నికలలకు నామినేషన్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే నామినేషన్ వేసే సమయంలో మాత్రం వెరైటీగా వచ్చి నామినేషన్లు వేస్తుంటారు. తాజాగా ఉత్తర ప్రదేశ్లో ప్రతీ రోజూ బండిపై సమోసాలు అమ్ముకునే ఓ వ్యక్తి .. స్థానిక పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో సమోసా వాలా చెప్పిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. అక్కడ సమోసా బండి నడుపుకునే వ్యక్తిలాగే సికింద్రాబాద్లో ఓ ఆటో డ్రైవర్ నామినేషన్ వేయడంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది.
నామినేషన్ వేసేందుకు కారణమిదే..
వారాసిగూడకు చెందిన మహ్మద్ ఇబ్రహీం.. రోజూ ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన ఆటో నడిపితేనే వచ్చే డబ్బులతో ఆ కుటుంబం పూట గడుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎంపీగా నామినేషన్ వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడికి ఎలాంటి న్యాయం చేయకపోవడం వల్లే తాను నామినేషన్ వేసినట్లు మహ్మద్ చెబుతున్నారు. ఆటో డ్రైవర్ నైన తనను ఇక్కడ ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపిస్తే సామాన్యుల కోసం పోరాటం చేస్తానని
హామీ ఇచ్చారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో..
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ చెప్పులు కుట్టుకునే వ్యక్తి అసెంబ్లీ బరిలో నిలిచారు. ఏడిద భాస్కరరావు నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇంటర్ వరకు చదివిన భాస్కరావు స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. చెప్పులు కుడుతూనే ఆయన ఎంఏ రాజనీతిశాస్త్రంపై అధ్యయనం చేశారు. తన వద్ద 20 వేల రూపాయల మాత్రమే నగదు ఉందని, అయినప్పటికీ ఆత్మ విశ్వాసంతో ఎన్నికల బరిలో దిగినట్లు భాస్కరరావు తెలిపారు. పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వంగా గీత పోటీలో ఉన్నారు.
————————————————–