* అమిత్ షా ఫేక్ వీడియో కేసులో..
* రిజర్వేషన్ల రద్దు అంశంపై
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతున్న వేళ కాంగ్రెస్ సీఎం రేవంత్ కు నోటీసులు జారీ చేయడంపై కలకలం రేపుతోంది. ఫేక్ వీడియోకు సంబంధించి రేవంత్ కు నోటిసులు వచ్చినట్లు తెలిసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో కేసులో రేవంత్ కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే1 లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. టీపీసీసీ ట్విట్టర్ హ్యాండిల్ అమిత్ షా కు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఆ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్లుగా ఉంది. నిజానికి రాజ్యాంగా విరుద్దమైన ముస్లీం రిజర్వేషన్లను రద్దు చేసి ఆ హక్కులను తిరిగి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకే అందిస్తామని అమిత్ షా చెప్పారని బీజేపీ చెబుతోంది. మార్పింగ్ వీడియో ఆధారంగా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అమిత్ షా అనని మాటలను ఎడిట్ చేసి ఫేక్ వీడియో తయారు చేశారని బీజేపీ, హోంశాఖ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ ఇతర కాంగ్రెస్ నాయకులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ నోటీసుల అంశంపై రాజకీయ దుమారం చెలరేగే అవకాశాలు ఉన్నాయి.
—————————