* నిఖార్సయినా సోషల్‌మీడియా గళం
* మోదీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్న రాథీ వీడియోలు
* లోక్‌సభ ఎన్నికల వేల ట్రెండింగ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మీడియాలోని ప్రధాన స్రవంతి.. సాహో.. మోదీ ( Narendra Modi ) అంటూ మోకరిల్లుతున్న వేళ..కార్పొరేట్ దిగ్గజాలు మీడియా రంగంలోకి సైతం ప్రవేశించి ప్రభుత్వ వ్యతిరేక సమాచారాన్ని సమాధి చేస్తున్న వేళ..మోదీ నియంత? అంటూ ముక్కుసూటిగా బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిన.., ఎలక్టోలర్ బాండ్స్.. ది బిగ్గెస్ట్ స్కాం.. అని ఆధారాలతో సహా వెల్లడించిన నిఖార్సయినా సోషల్‌మీడియా గళం ధ్రువ్ రాథీ ( Dhruv Rathee ) .
లోక్‌సభ ఎన్నికల్లో ట్రెండింగ్ లో ఉన్న ఫేమస్ యూట్యూబర్ ధ్రువ్ రాథీ. ఒక నిర్భయమైన సోషల్‌మీడియా జర్నలిస్ట్. వర్తమాన రాజకీయ కుట్రలను దాదాపు దశాబ్దకాలంగా ఎండగడుతున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం సమయంలో తన వీడియోలతో సంచలనాలు రేకెత్తిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kezriwal ) అరెస్ట్ నేపథ్యంలో.. ‘‘ప్రజాస్వామిక భారతదేశం.. నియంత్రత్వం వైపు మళ్లుతుందా.. ’’ అనే కోణంలో అతడు విడుదల చేసిన వీడియో.. సోషల్ మీడియాను షేక్ చేసింది. బీజేపీకి చెమలు పట్టించింది. అలాగని.. ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు అంటే.. ‘ది రియల్ స్టోరీ ఆఫ్ ధ్రువ్ రాథీ’ అనే వీడియోలో తనను తాను “100% కాంగ్రెస్ వ్యతిరేకిగా” ప్రకటించుకున్నారు. అధికారంలో ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రశ్నిస్తా అంటూ సగర్వంగా చాటి చెప్పారు.
అవినీతి వ్యతిరేక ఉద్యమం తర్వాత..
‘‘నాకు చిన్నప్పటి నుంచి వీడియోలు రూపొందించాలనే ఆసక్తి ఉంది. నా యూట్యూబ్ చానల్ లో నా జీవిత కథను, ట్రావెల్ వీడియోలు అప్లోడ్ చేయాలని అనుకున్నాను. అయితే 2011లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం తర్వాత నాకు వర్తమాన అంశాలు, రాజకీయాలపై ఆసక్తి పెరిగింది.’’ అని ఓ సందర్భంలో వివరించారు ధ్రువ్ రాథీ. 29 సంవత్సరాల వయస్సు ఉన్న ధృవ్ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా మారారు. సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలపై వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు. దాదాపు 1.8 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దాదాపు అందరికీ ఆయన చేరువ అవుతున్నారు. 2016లో ఉరి దాడి, భారత నియంత్రణ రేఖ సమ్మె, 2016 నోట్ల రద్దు, గుర్మెహర్ కౌర్ వివాదం, మోర్బి వంతెన కూలిపోవడం, 2019 పుల్వామా దాడి, 2023 మణిపూర్ హింస లాంటి అంశాలపై అతని వీడియోలు నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి.
ట్రెండింగ్ లో ధ్రువ్ రాథీ
దాదాపు దశాబ్దకాలం పైగా.. సోషల్‌మీడియా యాక్టివిస్ట్ గా ఉన్న ధ్రువ్ రాథీ.. లోక్ సభ ఎన్నికల వేల బాగా పాపులర్ అయ్యారు. ఆయన చేసిన వీడియోలు కొన్ని వారాలుగా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను కొట్టివేసిన వెంటనే అతను తన యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేసిన ఓ వీడియో పెను ప్రకంపనలను సృష్టించింది. ది బిగ్గెస్ట్ స్కాం అంటూ.. ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ ఎలా స్కామ్ చేసిందో వివరిస్తూ రాథీ చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, బీజేపీని వ్యతిరేకించే వారిపై ఈడీ దాడుల నేపథ్యంలో ‘భారతదేశం నియంతృత్వంగా మారుతోందా?’ అనే పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. అది కూడా సంచలనం రేపింది. 25 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియోలో ధృవ్ ఎన్నికల సంఘం పని తీరుపై కూడా ప్రశ్నలు సంధించారు. భారతదేశ ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితిని కూడా అతను నిలదీశారు. ప్రస్తుతం కనీస మద్దతు ధర అంశం, అంబేడ్కర్, గాంధీ, సుభాష్ చంద్రబోస్ పేర్లతో మోదీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలపై రాథీ చేసిన వీడియోలు చాలా మంది వాట్సప్ స్టేటస్ లుగా మారాయి.
రోజూ కోటి మందికి..
ధ్రువ్ రాథీ యూట్యూబ్ చానల్ కు 1.8 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వారిలో నిత్యం కనీసం కోటి మందికి ఆయన వీడియోలు చేరుతున్నాయి. దాంతోనే ధ్రువ్ తృప్తి పడడం లేదు. దేశంలోను, విదేశాల్లోను నివశిస్తున్న ప్రతి ఒక్క భారతీయుడికి తన వీడియో చేరాలనేది అతడి లక్ష్యం. మతం, కులం, లింగ భేదం లేకుండా 100 కోట్ల మందికి తన వీడియోలు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన వీడియోలకు వచ్చే నెగెటివ్ కామెంట్లను కూడా ధ్రువ్ స్వీకరిస్తాడు.
నెలకు 50 లక్షల ఆదాయం
ధ్రువ్ రాథీ.. తన వీడియోల ద్వారా పాపులర్ అవ్వడమే కాదు.. బాగానే సంపాదిస్తున్నాడు. తొలుత తన ట్రావెల్ వీడియోలను అప్లోడ్ చేస్తూ యూట్యూబ్ కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే వెంటనే రాజకీయ, సామాజిక అంశాలను కవర్ చేయడం స్టార్ట్ చేశాడు. యూట్యూబ్‌ను రాజకీయ వేదికగా ఉపయోగించిన తొలి భారతీయ వినియోగదారులలో రాథీ ఒకరు. 2023లో ధృవ్ రాథీ యూట్యూబ్ లో డైమండ్ ప్లే బటన్‌ను అందుకున్నారు. T- సిరీస్, ప్యూడీ పై, మిస్టర్ బీస్ట్ లాంటి ప్రసిద్ధ యూట్యూబర్ల జాబితాలో చేరారు. ధృవ్ రాథీ దేశంలో అత్యధికంగా చెల్లించే యూట్యూబర్లలో ఒకరు. జాగ్రన్ వెబ్‌సైట్‌లోని ఒక నివేదిక ప్రకారం, ధృవ్ రాతీ నికర విలువ రూ. 27 కోట్లు. అతని నెలవారీ ఆదాయం దాదాపు రూ.50 లక్షలు. భవిష్యత్ తరం నాయకుల జాబితాలో త్వరలోనే ధ్రువ్ పేరు చేరుతుందని 2023లో టైమ్స్ మ్యాగజైన్ ప్రచురించింది.
విమర్శలు, కేసులు సైతం..
బీజేపీకి చుక్కలు చూపెడుతూ.. సంచలన వీడియోలను రూపొందిస్తూ కోట్ల మందికి అభిమానిగా మారిన ధ్రువ్ రాథీ.. విమర్శలను, ఎన్నో కేసులను సైతం ఎదుర్కొంటున్నాడు. అతడి మీడియాలు ఏకపక్షంగా ఉంటాయని విమర్శించే వారూ ఉన్నారు. హర్యానాలోని రోహ్తక్లో జన్మించిన ధృవ్ రాథీ తన స్కూల్ విద్యను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురంలో చదివారు. హైస్కూల్ చదువును పూర్తి చేసిన తర్వాత జర్మనీలోని ఓ ఇన్స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ చదివాడు. ఆ తర్వాత మాస్టర్స్ డిగ్రీని కూడా పూర్తి చేశాడు. జర్మనీ పౌరురాలైన జూలీను వివాహం చేసుకుని బెర్లిన్‌లో సెటిల్ అయ్యాడు. అక్కడి నుంచే భారతదేశంలోని రాజకీయ, ఇతర అంశాలపై అధ్యయనం చేసి వీడియోలను రూపొందిస్తున్నాడు. బెర్లిన్ లో ఉంటూ భారతదేశ అంశాలను విమర్శించే అర్హత ఆయనకు లేదన్నవారూ ఉన్నారు. అయితే తనను తాను.. YouTube అధ్యాపకుడిగా పిలుచుకోవాలనుకుంటున్నానని, ప్రశంసలను, విమర్శలను పట్టించుకోకుండా వర్తమాన అంశాల్లోని లోపాలను వివరించడమే తన లక్ష్యం అంటున్నారు ధ్రువ్ రాథీ.
—————————