డబ్బు పంకాల్లో తేడాతోనే ..
* డబ్బు పంపకాల్లో తేడా వల్లనే
* చందునాయక్ హత్య
* ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
* కీలక విషయాలు వెలుగులోకి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మలక్‌పేటలో సీపీఐ నేత చందునాయక్ (CHANDUNAYAK)ను కాల్పి చంపిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తనతో కలిసి గతంలో పార్టీలో తిరిగిన, భూ సెటిల్ మెంట్లలో పాల్గొనే వ్యక్తే ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. మలక్ పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కేసు వివరాలను వెల్లడించారు. సీపీఐఎంఎల్ (CPIML)లిబరేషన్‌కు చెందిన రాజేశ్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి. అతడి వద్ద ఎప్పటి నుంచో తుపాకులు ఉన్నాయి. తన వద్ద ఉన్న తుపాకులను ఈ హత్యకు ఉపయోగించాడు. చందునాయక్, రాజేశ్‌పై భూ వివాదాలకు సంబంధించి చిన్న చిన్న కేసులు ఉన్నాయి. ఈనెల 15న మలక్ పేటలో చందునాయక్‌పై తుపాకీతో కాల్పులు జరిగాయి. చందునాయక్, రాజేశ్ కలిసి కొన్ని స్థిరాస్తి వివాదాలు పరిష్కరించినట్లు పోలీసులు తెలిపారు. సెటిల్ మెంట్ల ద్వారా వచ్చిన డబ్బులు ఇవ్వలేదని కూడా రాజేశ్ కోపం పెంచుకున్నాడు. పార్టీ కార్యకలాపాలకు కూడా దూరం చేశాడని చందునాయక్‌పై రాజేశ్ కోపం పెంచుకున్నాడు.
ఏపీకి చెందిన నేరస్థులతో హత్యకు ప్లాన్
ఏపీ(AP)కి చెందిన కొందరు నేరస్థులతో కలిసి చందునాయక్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. పాత నేరస్థులతో ఒప్పందం చేసుకున్నాడు. ఉప్పల్ (UPPAL)భగాయత్‌లో నేరస్థులకు ఆశ్రయం కల్పించి ఈనెల 15న కుట్రకు అమలు చేశారు. రాజేశ్‌తో పాటు ఆరుగురు ముఠాసభ్యులు కలిసి శాలివాహన నగర్‌కు వచ్చారు. తుపాకులు విఫలమైతే కత్తులతో నరికి చంపాలని వాటిని కూడా వెంట తెచ్చుకున్నారు. తుపాకులు, కత్తులు, కారం కారులో పెట్టుకుని వచ్చారు. కాల్పుల తర్వాత ఉప్పల్ బగాయత్కు వచ్చారు. అక్కడి నుంచి కోదాడకు చేరుకున్నారు. రాత్రి కావలి చెక్ పోస్టు వద్ద కొందరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు నిందితులను జనగామ జిల్లా(JANAGAMA DISTRICT)ల్లో పట్టుకున్నారు. మొత్తం ఆరుగురు నిందితులకు గాను పోలీసులు ఐదుగురిని పట్టుకున్నారు. నిందితుల్లో కొందరికి నేరచరిత్ర ఉందని డీసీపీ తెలిపారు. పది బృందాలు ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నాయి. ఈ కేసును త్వరితగతిన పరిష్కరించిన టాస్క్ ఫోర్స్ ఇతర బృందాలకు సీపీ రెండు లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు.

