
*మూడుముళ్లేసి మూడేళ్లు
*కాపురానికి రమ్మంటే కాదు పొమ్మంటున్నాడు..
*కన్నెర్ర చేసిన కట్టుకున్న భార్య
*అత్తారింటి ముందు ఆందోళన
ఆకేరు న్యూస్, జనగామః భర్త కాపురానికి తీసుకెళ్లడంలేదని అత్తగారింటి ముందు ఓ మహిళ ఆందోళనకు దిగిన సంఘటన జనగామ జిల్లా జఫర్గడ్ మండలం షాపల్లిలో చోటుచేసుకుంది.భర్త కోసం దీక్ష చేస్తున్న ఆ అమ్మాయి పేరు శివరాత్రి శ్రావణి. ఆమె తల్లిదండ్రులు గుర్రం స్వామి, నీలమ్మలు. వీరిది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామం. అబ్బాయి పేరు శివరాత్రి శ్రీకాంత్. ఇతడి తల్లిదండ్రులు లక్ష్మీ,వెంకటేశ్. వీరిది జనగామ జిల్లా జఫర్గడ్ మండలం షాపల్లి గ్రామం. 2023 జూన్‌లో శ్రావణికి, శ్రీకాంత్‌కు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రావణి తల్లిదండ్రులు కట్నం కింద రూ.15లక్షలు అడిగితే సరే అని ఒప్పుకున్నారు. కాని వివాహం సమయానికి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మరింత కట్నం కావాలని అడిగితే మరో రూ.15లక్షలు కలిపి మొత్తంగా రూ.30లక్షలు చెల్లించారు. వివాహం జరిగిన తరువాత కాపురానికి ఎంతో సంతోషంగా వెళ్లింది శ్రావణి. 40 రోజుల కాపురం తరువాత ఇక కష్టాలు షురూ అయ్యాయని, అదనపు కట్నం కావాలని పోరు మొదలైందని శ్రావణి తెలిపింది.హైదరాబాద్ లో ఇల్లు కొనివ్వమని అంటున్నాడని తెలిపింది. అత్తామామలు కూడా కొడుకుకు వంతపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మూడేళ్ల కిందట హైదరాబాద్ లో అద్దెకు ఉందామని తీసుకెళ్లి తనను ఒంటరిగా వదిలేసి వెళ్లాడని తెలిపింది. చేసేది లేక మూడేళ్లుగా తల్లిగారి ఇంటి వద్దే ఉంటున్నాని ఆవేదన వ్యక్తం చేసింది. అత్తామామలు ఉన్న ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆ ఇంటి ముందే మూడు నాలుగు రోజులుగా వంట చేసుకుంటూ అక్కడే ఉంటోంది, తనకు న్యాయం జరిగేవరకూ ఇక్కడే ఉంటనని చెప్తోంది.
…………………………………..