* ఇంటర్ పరీక్షల వేళ వరంగల్ జిల్లాలో ఆంక్షలు…
* 163 సెక్షన్ విధిస్తూ సీపీ ఉత్తర్వులు
ఆకేరు న్యూస్, వరంగల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి (ఫిబ్రవరి 25) నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ అప్రమత్తమైంది. పరీక్షలు అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
* 94 కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో హన్మకొండ జిల్లాలో 52, వరంగల్ జిల్లాలో 24, మరియు జనగామ జిల్లాలో 16 కేంద్రాలు ఉన్నాయి. ఈ అన్ని కేంద్రాల వద్ద పరీక్షలు ముగిసే వరకు కఠినమైన నిఘా ఉంటుందని సీపీ స్పష్టం చేశారు.
* పరీక్షల షెడ్యూల్
తేదీలు: ఫిబ్రవరి 25, 2026 నుండి మార్చి 18, 2026 వరకు.
సమయం: ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
నిషేధాజ్ఞలు – ముఖ్యమైన సూచనలు:
పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ క్రింది ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుమికూడటం నిషేధం: పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకచోట చేరకూడదు.
ర్యాలీలు, ధర్నాలు వద్దు: పరీక్షా సమయాల్లో ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు లేదా నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి వీలులేదు.
జిరాక్స్ సెంటర్ల మూసివేత: పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ షాపులను ప్రతిరోజూ ఉదయం 06:00 నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలని సీపీ ఆదేశించారు.
చట్టపరమైన చర్యలు తప్పవు-సీపీ
విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు వీలుగా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే లేదా పరీక్షల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
