
నెక్ట్స్ ఎవరు?
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ రాజీనామా(Jagdeep dhankhars Resignation)ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు ఫైల్‌పై సంతకం చేశారు. తక్షణమే అమల్లోకి వస్తుందని రాజ్యసభలో ఘన్‌శ్యామ్ తివారీ ప్రకటన చేశారు. ఉపరాష్ట్రపతి రాజీనామాపై హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ధన్ఖర్ రాజీనామా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇది బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా జగదీప్ రాజీనామాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) ఈరోజు స్పందించారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై ఎక్స్ వేదికగా స్పందించారు. వివిధ హోదాల్లో ధన్‌ఖడ్ దేశానికి ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ఆయన్ను ప్రశంసించారు. జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.“జగదీప్ ధంఖర్ కి భారత ఉపరాష్ట్రపతిగా సహా వివిధ హోదాల్లో మన దేశానికి సేవ చేయడానికి అనేక అవకాశాలు లభించాయి. ఆయనకు మంచి ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా.. హిందీ, ఆంగ్ల భాషలలో పోస్ట్ చేశారు.
తర్వాత ఎవరు?
2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ధన్ఖర్ పోటీ చేసి 528 ఓట్లు సాధించి విజయం పొందారు. ఆయనకు ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వా గట్టిపోటీ ఇచ్చినా, ధంఖర్ భారీ మెజార్టీతో గెలిచారు. తాజాగా అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 68 ప్రకారం, ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే లేదా మరణిస్తే, త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంతవరకు రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ లేదా రాష్ట్రపతి అధికారం ఇచ్చిన ఇంకెవరైనా తాత్కాలికంగా చైర్పర్సన్ విధులు నిర్వహిస్తారు. ఈనేపథ్యంలో తర్వాత ఉపరాష్ట్రపతి ఎవరనే చర్చ ప్రారంభమైంది.
……………………………………