
* పంటలను కాపాడుతాంః కడియం
* చివరి ఆయకట్టు వరకు సాగునీరుః యశస్విని
* సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యేలు
ఆకేరు న్యూస్, జనగామః రైతులకు సాగునీరు ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు ఎప్పుడు సిద్దంగానే ఉందని.. కాని కొందరు నాయకులు ధర్నాలతో, యాత్రలతో రైతులను దగా చేస్తుండ్లని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుదవారం ధర్మసాగర్ రిజర్వాయర్ దక్షిణ కాల్వ నుంచి ధర్మసాగర్, ఐనవోలు, సంగెం, జఫర్గడ్, హసన్పర్తి మండలాలకు, స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ కుడి ప్రధాన కాల్వ నుంచి దేవరుప్పుల, పాలకుర్తి, గుండాల, లింగాల ఘన్పూర్, కొడకండ్ల మండలాలకు సాగునీటి జలాలను వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, మామిడాల యశస్విని రెడ్డిలతో కలిసి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో రైతులు సాగునీరు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. రైతులు దుక్కులు దున్నుకుని, నార్లు పోసుకుని, నాటు వేసుకునేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. వరుణుడు కరుణించకపోవడంతో రైతులు సాగునీటి కోసం తండ్లాడుతున్నారని తెలిపారు. ఈ తరుణంలో రైతులకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అండగా ఉన్నారని, అందుకే అదును చూసి దేవాదుల నుంచి సాగునీరును విడుదల చేస్తున్నామని అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారమే ముందుగా దేవాదుల నుంచి బీమ్ ఘన్పూర్, రామప్ప, ధర్మసాగర్, స్టేషన్ ఘన్పూర్, మల్లన్నగండి, బొమ్మకూరు రిజర్వాయర్లను ఎత్తిపోతల ద్వారా నీటిని నింపామని తెలిపారు. మోటార్లు పనిచేయకపోవడంతో వాటిని రిపేర్లు చేపించి రిజర్వాయర్లను నింపామని అన్నారు. ఇప్పుడు కాల్వల ద్వారా నీటిని నవాబు పేట రిజర్వాయర్ నింపుతామని అన్నారు. ఇంకా పలు మండలాలకు కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపుతామని అన్నారు. దేవాదుల ఫేజ్ 1 నుంచి 10క్యూబిక్, దేవాదుల ఫేజ్ 2 నుంచి 14క్యూబిక్, దేవాదుల ఫేజ్3 నుంచి 16 క్యూబిక్ల చొప్పున మొత్తం 40 క్యూబిక్ నీటిని పంపింగ్ చేస్తామన్నారు. 40 క్యూబిక్లు అంటే 1200 క్యూసెక్కులకు పైగా అని అన్నారు. ఆన్ అండ్ ఆఫ్ పద్దతిన చెరువులు, కుంటలు, కాల్వలు నింపుతామని, దీంతో దిగుబడి అధికంగా వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారని అన్నారు. ముందుగా 15రోజలు కాల్వలకు నీరు ఇచ్చి, అటు పిమ్మట మళ్ళి రిజర్వాయర్లను నింపి ఆ తర్వాత మళ్ళీ చెరువులు, కుంటలకు సాగునీరు విడుదల చేస్తామని, రైతులు సహకరించాలని కోరారు. రైతుల పంటలు కాపాడే బాధ్యత మా సర్కారుదే అని అన్నారు. కొందరు కావాలని యాత్రల పేరుతో రాజకీయం చేస్తున్నారని, నీటిని విడుదల చేస్తామని ముందుగానే తెలుసుకుని ధర్నాల పేరుతో డ్రామాలు చేస్తున్నారని అన్నారు. ధర్నాల పేరుతో రైతులను దగా చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని హితువు పలికారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతులకు చివరి ఆయకట్టు దాకా నీరందించే బాధ్యత మాదే అన్నారు. ఎవ్వరు ఏ రాజకీయం చేసినా, మాకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. ఓ ప్లాన్ ప్రకారమే రైతులకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు.
…………………………………………