
* పనుల్లో మరో ముందడుగు
* భూసేకరణకు నిధులు విడుదల
* రూ.205 కోట్లు ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు
* బాధితులకు చెల్లింపులూ మొదలు
* ఇక ఆ ఒక్కటే పెండింగ్?
* నిర్దేశిత సమయంలోగా అందుబాటులోకి ఎయిర్పోర్టు !
ఆకేరు న్యూస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ రూపురేఖలను మార్చే బృహత్తర ప్రాజెక్టులో మరో కీలక అడుగు ముందుకు పడింది. మామునూరులో నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టు నిర్మాణానికి కాంగ్రెస్ సర్కారు నిధులు విడుదల చేసింది. భూసేకరణ పనుల నిమిత్తం రూ.205 కోట్లు విడుదల చేసింది. నిధులు రావడమే తరువాయి.. టైటిల్ క్లియర్గా ఉన్న 15 మంది రైతుల ఖాతాల్లో రూ.13.74 కోట్ల పరిహారాన్ని జమ చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ప్రకటించడం పనుల వేగాన్ని తెలియజేస్తోంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండడంతో నిర్దేశిత గడువు లోపలే ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
కేంద్రమంత్రి ప్రకటన వెలుడిన నాటి నుంచే..
వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. చారిత్రక నేపథ్యం కూడా ఉంది. 1935 సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఎయిర్ పోర్టు ఆ తర్వాత నిజాం పాలనలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారత వైమానిక దళానికి ఎంతగానో ఉపయోగపడింది. అప్పట్లో వర్తక వాణిజ్యాలకు కూడా ఇది కీలకంగా పనిచేసింది. అయితే.. 1981 వ సంవత్సరంలో మామునూర్ ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.., కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేగం పుంజుకుంది. పనులు శరవేగంగా చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఎయిర్ పోర్టు విషయమై సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మంత్రి కొండా సురేఖ రెడ్డి తదితరులు పలుమార్లు కేంద్ర పెద్దలను కలిశారు. ఫలతంగా ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే నిర్మాణం మొదలు పెడతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. అప్పటి నుంచీ భూసేకరణ పనులను వేగవంతం చేసి.. ప్రస్తుతం తుదిదశకు వచ్చేలా ప్రభుత్వం, అధికారులు కృషి చశారు.
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సేకరణ
ఎయిర్ పోర్టు నిర్మాణానికి మొత్తం 949.14 ఎకరాల భూమి అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధీనంలో ప్రస్తుతం 696.14 ఎకరాల భూమి ఉంది. దీంతో మరో 253 ఎకరాల భూమి అవసరమని కేంద్రం సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. భూసేకరణలో భాగంగా మామునూరు పరిసర ప్రాంతాలైన గాడిపల్లి, నక్కలపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో 240 ఎకరాల వ్యవసాయ భూమి, 61,134.5 చదరపు గజాల వ్యవసాయేత భూమిని అధికారులు సేకరిస్తున్నారు. ఈ సేకరణలో 12మంది తమ ఇళ్లను కోల్పోతున్నారు. అయితే, పలుమార్లు చర్చల అనంతరం వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.1.20కోట్లు, వ్యవసాయేతర భూమి గజానికి రూ.4,887 పరిహారంగా నిర్ణయించారు. మెజారిటీ భూముల సేకరణ పూర్తయినప్పటికీ పరిహారం ఇప్పటి వరకూ అందలేదు. ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేయడంతో జిల్లా కలెక్టర్ సత్యశారద కూడా చొరవ చూపి బాధితులకు వెనువెంటనే అందజేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆ ఒక్కటే పెండింగ్..
భూసేకరణ పరిహారం కోసం రూ.205 కోట్లు కేటాయిస్తూ గతేడాది నవంబరులో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ భూసేకరణ తుది దశకు చేరడంతో పరిహారం చెల్లించేందుకు ఇప్పుడు నిధులు విడుదల చేసింది. అయితే ఇళ్లు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇవ్వాలనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇల్లు కోల్పోతున్న ఒక్కో కుటుంబానికి రూ.11.64లక్షలు ఇస్తామని గాడేపల్లిలో శుక్రవారం జరిగిన గ్రామసభలో అధికారులు ప్రతిపాదించారు. కానీ, తమకు మరింత పరిహారం కావాలని బాధితులు డిమాండ్ చేయటంతో ఈ అంశం పెండింగ్లో పడింది. భూసేకరణ పూర్తయితే మూడేళ్లలో ఎయిర్పోర్టు పనులు పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
………………………………………………….