
Mahesh babu
* ప్రిన్స్.. సినీ హోదానే కాదు.. సేవలోనూ రాజే
* చిట్టి గుండెలు ఆగిపోకుండా సర్జరీలు
* ఆర్భాటం లేని సహాయాలు ఎన్నో..
* నేడు ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు
ఆకేరు న్యూస్, సినీ డెస్క్ : కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు.. అటువంటి వ్యక్తుల్లో ఒకరు మహేశ్ బాబు.. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు.. ప్రిన్స్ మహేశ్. రాజకుమారుడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిన మహేశ్.. ఎందరో బాధిత చిన్నారుల గుండె చప్పుడు కూడా. ఏ చిట్టి గుండె లయ తప్పినా, తల్లిదండ్రులకు చికిత్స చేయించే స్థోమత లేకపోయినా తాను ఉన్నానంటూ అండగా నిలుస్తున్నాడు. ఇలా పదులు, వందల సంఖ్యలో కాదు.. వేల సంఖ్యలో చిన్నారుల గుండె ఆపరేషన్లకు మహేశ్ బాబు ఆర్థిక సాయం అందించారు. ఎంతో మందికి ఊపిరిపోశారు.
హీరోయిజమే కాదు.. హ్యూమనిజం కూడా..
సినీ రంగంలో మహేశ్బాబుకు ఉన్న క్రేజు తెలియంది కాదు. హీరోయిజంతో పాటు పసందైన కామెడీ, పంచ్ డైలాగులతో అదరగొట్టే ఆయన బాహ్య ప్రపంచంలో అరుదుగానే మాట్లాడారు. ఎవరితోనూ అంతగా కలవరు.. కానీ గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు ఎక్కడున్నా తన టీం ను పంపించి, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు కాదే.. మహేశ్ బాబు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సేవ చేస్తున్నారు. చిన్నారుల హృదయాల చప్పుడుగా నిలుస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు సుమారు 5వేలకు పైగా చిన్నారి గుండెలకు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయించారు. కానీ.. ఆ విషయం ఇప్పటికీ కొంత మందికి తెలియదు. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు ఎక్కడ ఉన్నా కూడా మహేష్ బాబు టీమ్ వారిని సంప్రదించి వారికి కావాల్సిన చికిత్స ను చేయిస్తున్నారు. ఆంధ్రా ఆసుపత్రి తో కలిసి మహేష్ బాబు ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
బృహత్తర కార్యక్రమం వెనుక..
మహేశ్ బాబు ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపట్టడానికి ఓ కారణం ఉంది. మహేశ్ కుమారుడు గౌతమ్ కు చిన్నతనంలో గుండె సంబంధిత సమస్య తలెత్తిందట. ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో ఖరీదైన వైద్యం చేయించారట. దాంతో గౌతమ్ కోలుకున్నారు. మాకు డబ్బులు ఉన్నాయి.. వైద్యం చేయించాము.. లేని వారి పరిస్థితి ఏంటి.. అనే ఆలోచన నుంచే మహేశ్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి బాధిత చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. అందుకోసం మహేశ్ బాబు పేరుతో ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ వ్యవహారాన్ని ఆయన భార్య నమ్రత శిరోద్కర్ చూసుకుంటారు. సినిమాల వరకు వస్తే.. మహేశ్ బాబు ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్టర్ కావడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
——————-