
* సోయి లేకుండా మాట్లాడకండి..
*వాస్తవాలు చెప్పండి..
* పలుకుబడి ఉంటే కేంద్రం నుంచి యూరియా తెప్పించండి..
* బీజేపీ అధ్యక్షుడికి మంత్రి తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్
* బీఆర్ ఎస్ నేతలపైనా ఆగ్రహం
* చచ్చిపోయిన పార్టీని బతికించుకునేందుకు విఫలయత్నం
* రైతులతో ఆటలాడొద్దు.. దమ్ముంటే కేంద్రంతో దెబ్బలాడాలని హితవు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చచ్చిపోయిన పార్టీని బతికించాలనో, పోయిన అధికారాన్ని సాధించాలనో కొందరు విఫల ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ ఎస్ నేతలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (TUMMALA NAGESWARARAO) ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులతో ఆటలాడొద్దని, దమ్ముంటే కేంద్రంతో దెబ్బలాడాలని సూచించారు. దయచేసి అతి, అహంకార, అబద్దాల మాటలు మాట్లాడి పరువు తీసుకోవద్దని హితవు పలికారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆరోపణలు చేసినా, రాజకీయ పరంగా తెలంగాణ ప్రభుత్వాన్ని సాధించాలని చూసినా ఎవరికీ లాభం ఉండదన్నారు. అధికారం కోసం ఆరాట పడితూ, అబద్దాలు ఆడితే అధికారం రాదన్నారు. రెండేళ్లకే అధికారం కోసం ఇంత ఆరాటం పడితే, ఎండ మావులను చూసి నీళ్లనుకుని పరుగులు పెట్టొద్దన్నారు. మీ చేసిన నిర్వాకం చూసే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టారని తెలిపారు. ప్రతిపక్ష పాత్ర అయినా సమర్థవంతంగా నిర్వహించాలని బీఆర్ ఎస్ (BRS) నేతలకు సూచించారు. నేను గేట్లు ఎత్తుతా, నేను మీటర్లు నొక్కుతా అంటే చూస్తూ ఊరుకోమన్నారు.
మీరేదో ఇచ్చినట్లు.. తామేదో దాచుకున్నట్లు ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు(RAMACHANDRA RAO) పై కూడా తుమ్మల ఫైర్ అయ్యారు. వచ్చిన మూడు రోజుల్లోనే పార్టీని అధికారంలోకి తేవాలని, బాగుచేయాలని భావిస్తే అది మీ తరం కాదన్నారు. రామచంద్రరావు పలుకుబడి ఉంటే కేంద్రం నుంచి యూరియా తెప్పించాలని సూచించారు. యూరియా విషయంలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. మీరేదో ఇచ్చినట్లు తామేదో దాచుకున్నట్లు ఏంటా మాటలని, యూరియా దాచుకుని తింటారా రామచంద్రరావు గారూ అని ప్రశ్నించారు. కనీస సోయి లేకుండా అస్తమానమూ అబద్దాలు ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ అబద్దాలు ఆడితే మీ పరువే పోతుందని, తమకేం నష్టం లేదని మంత్రి తుమ్మల అన్నారు.
……………………………..