
* మహబూబ్‌నగర్‌లో విషాదం
ఆకేరు న్యూస్, మహబూబ్‌నగర్ : రేబిస్ వస్తుందేమోన్న భయం.. సోకిందోనన్న అనుమానం ఆమెను పట్టిపీడించాయి. ఆ అనుమానం, మనోవేదనతో అనారోగ్యం పాలైంది. అంతేకాదు.. కుమార్తెను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ (Mahaboobnagar)కు చెందిన నరేశ్, యశోద (36) దంపతులకు ఇద్దరు పిల్లలు అనురాగ్, అక్షర ఉన్నారు. ఇటీవల వాళ్ల ఇంటి ముందు పల్లీలు, డ్రైఫ్రూట్స్ ఆరబెట్టారు. వాటిని వీధికుక్కలు ఎంగిలి చేశాయి. వాటిని అలాగే వంటల్లో వినియోగించారు. అప్పటి నుంచీ కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో యశోద తీవ్రంగా భయపడిపోయింది. కుక్కలు ఎంగిలి చేసిన ఆహారం తినడం వల్ల రేబిస్ (Rabis) సోకి ఉంటుందేమోనని ఆందోళన చెందింది. వారి ఆందోళనతో కుటుంబ సభ్యులు అందరికీ నరేశ్ రేబిస్ నివారణ టీకాలు కూడా వేయించాడు. నాటు మందులు కూడా వాడారు. రేబిస్ వ్యాధి గురించి యూట్యూబ్‌లోనూ వెతికిందని నరేశ్ చెబుతున్నారు. ఇదే సమయంలో యశోద చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడింది. దీంతో ఆమె మరింత మనోవేదనకు గురైంది. భర్త ఉద్యోగానికి వెళ్లగానే మూడేళ్ల కుమార్తెను చంపి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని భర్తకు, కొడుకుకు జాగ్రత్తలు చెబుతూ యశోద గోడపై రాయడం గమనార్హం. యశోద తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………….