
* పలు మార్గాలు మూసివేత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారీ వర్షాలు హైదరాబాద్ (Hyderabad) ను వణికిస్తున్నాయి. ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ (Himayathsagar) నిండుకుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్‌లో 8 గేట్లు, హిమాయత్ సాగర్‌లో 5 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నదికి వరద పోటెత్తింది. పురానాపూల్, చాదర్‌ఘాట్ వద్ద మూసీ నిండుగా ప్రవహిస్తున్నది. చాదర్‌ఘాట్ (Chadarghat) లోలెవల్ బ్రిడ్జిని తాకుతూ వరద వెళ్తున్నది. మరోసారి ముసారంబాగ్ బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తున్నది. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీతో పలు మార్గాలను మూసివేశారు. నార్సింగ్ ఔటర్ సర్వీసు రోడ్డును, ఔటర్ (Outer)ఎంట్రీ, ఎగ్జిట్ దారులను మూసివేశారు. మూసీ ఉధృతితో మంచిరేవుల – నార్సింగ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ముంపులో వన దుర్గ ఆలయం
ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం (Edupayal Temple) పూర్తిగా నిటమునిగింది. మంజీరానది ఉధృతితో గర్భగుడి ముందు నుంచి రేకులను తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసిన అధికారులు.. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆనకట్ట వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎగువన ఉన్న సింగూర్ (Singure) జలాశయంలో నీటిమట్టం పెరగడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మంజీరా నదిలో భారీగా వరద ప్రవాహం పెరిగి ఏడుపాయల ఆలయం చుట్టూ జలమయం అయింది. గత 15 రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నది.
………………………………………