
* స్ఫూర్తి దాయకంగా నిలిచిన లావణ్య
*చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన విద్యార్థిని
* చల్పాక నుంచి త్రిపుర వరకు కొనసాగిన చదువు ప్రయాణం
ఆకేరు న్యూస్,వరంగల్: మనిషై పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ..పట్టుదలే ఉంటే కాదనడు మరో బ్రహ్మా..అని ఓ సినీ కవి రాసిన పాటను గుర్తుకు వస్తోంది.. ఈ అమ్మాయి పట్టుదలను, సాధించిన విజయాలను చూస్తుంటే.. ఎక్కడో మారుమూల గూడెంలో పుట్టి నిట్ లాంటి కాలేజీలో సీటు పొందిందంటే దాని వెనకు ఆ అమ్మాయి చేసిన కృషి ఎంత ఉందో తెలుస్తోంది. ములుగుజిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అనే ఆదివాసీ గూడెంలో పుట్టిన మడప లావణ్య పట్టుదలతో చదివి చివరికి త్రిపురలోని అగర్తలా లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలేజీలో సీట్ సంపాదించింది.
తల్లిదండ్రుల ప్రోత్సాహం..
లావణ్యది పేద కుటుంబం . తల్లిదండ్రులు శంకరయ్య,రజితలు కూలీనాలీ చేసుకుంటూ ముగ్గురు కూతుళ్లను చదివిస్తున్నారు. లావణ్యకు చిన్నప్పటినుండి చదువుపై ఆసక్తి. లావణ్యకు చదువుకోవడానికి పేదరికం అడ్డుకాలేదు. ఆమెకు చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు తాము ఎంత కష్టమైనా సరే కూతురును మాత్రం పెద్ద చదువులు చదివించాలనుకున్నారు. కష్టపడి ఉన్నత చదువులు చదవాలని కూతురుని ప్రోత్సహించారు. ఈ నేపధ్యంలో లావణ్య తాత విశ్వనాధం ఐటీడీఏ ద్వారా వచ్చిన ఒక నోటిఫికేషన్ చూసి లావణ్యకు చూపించాడు. ఆ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకునే అవకాశం లావణ్యకు వచ్చింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేరడం లావణ్య జీవితంలో టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. ఐఏఎస్ ల కుటుంబాల పిల్లలు, ధనిక కుటుంబాల పిల్లలతో కలిసి చదువుకోవడం మొదట్లో భయంగా అనిపించినా తన ప్రతిభతో, గట్టి పట్టుదలతో వారికి ఏమాత్రం తీసిపోకుండా కష్టపడి చదివింది.
గురుకుల కళాశాలలో ఇంటర్..
10వ తరగతిలో అద్భుత ప్రతిభ చూపిన లావణ్య, వికారాబాద్ జిల్లా పరిగి గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ చదివింది. తాను పై చదువులు చదవాలన్న కోరికకు తగ్గట్టుగా ఆ కళాశాలలో బోధన కొనసాగింది. ఉన్నత చదువు చదవాలన్న పట్టుదలతో కష్టపడి చదివి త్రిపుర రాజధాని నగరం అగర్తలా లో ఉన్న నిట్ కాజేజీలో ఇంజినీరింగ్ లో సీటు పొందింది.
బంగారు గొలుసు.. మేకలు అమ్మి…
నిట్ అగర్తలాలో చేరాలంటే అగర్తలా వరకు ప్రయాణించాలి. ఖర్చుతో కూడుకున్న పని.ప్రయాణ ఖర్చులకు తల్లి తన వద్ద ఉన్న బంగారు గొలుసును అమ్మివేయగా తండ్రి తాను ఇష్టంగా పెంచుకుంటున్న మేకలను అమ్మివేశాడు. కూతురు క్షేమ సమాచారాలు తెలియాలంటే సెల్ ఫోన్ కావాలి కాబట్టి ఊర్లో కొంత అప్పుచేసి కూతురుకు సెల్ ఫోన్ కొనిచ్చాడు. తల్లి దండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి లావణ్య అగర్తలా ప్రయాణం అయింది.
రోల్ మోడల్ లావణ్య..
ఈ తరం పిల్లలకు లావణ్య ఓ రోల్ మోడల్ లా నిలిచింది. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని సందేశాన్ని ఇచ్చింది.
……………………………………………..