* సికింద్రాబాద్ లోక్‌సభలో ఆసక్తికరపోరు
* రెండోసారి గెలుపు కోసం శ్రమిస్తున్న కిషన్‌రెడ్డి
* ఎంపీ కావడానికి పోటీపడుతున్న ఎమ్మెల్యేలు
* ఆ సెగ్మెంట్ లో ఒక్కసారీ ఖాతా తెరవని బీఆర్ఎస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పార్లమెంట్ పోరు తుదిదశకు చేరుకుంటోంది. దీంతో అభ్యర్థులు దూకుడు పెంచారు. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. ఈక్రమంలో సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ కేంద్ర మంత్రితో ఢీ కొడుతున్నారు. 25 ఏళ్లుగా అక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ఉంటోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి బీఆర్ఎస్ కూడా పోటీ పడుతున్నా ఒక్కసారీ ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎంపీ స్థానం ఈసారి ఏ పార్టీకి దక్కుతుందనే ఆసక్తి నెలకొన్నది.
ఏ పార్టీకైనా వరుసగా రెండు సార్లు..
సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని ప్రజలు 1998 నుంచి ఏ పార్టీకైనా వరుసగా రెండు సార్లు చాన్స్ ఇస్తున్నారు. ఓ రెండు దఫాలు బీజేపీకి అవకాశం వస్తే.. మరో రెండు దఫాలు కాంగ్రెస్‌కు అవకాశం వచ్చింది. గడిచిన 25 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోరు కొనసాగింది. రాష్ట్రం ఏర్పాటు నుంచి సికింద్రాబాద్ స్థానంపై బీఆర్ఎస్ గురిపెట్టినా ఒక్కసారి కూడా సీటు దక్కించుకోలేదు. ఈసారి సికింద్రాబాద్‌పై గులాబీ జెండా ఎగురుతుందా.? లేకుంటే పదేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌కు అవకాశం దొరుకుతుందా.? అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ కమలం వికసిస్తే హ్యాట్రిక్ సాధించడంతో పాటు 25 ఏళ్లుగా ఉన్న రికార్డును బ్రేక్ చేసినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
12 సార్లు కాంగ్రెస్ దే
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్ కైవసం చేసుకోగా, ఐదుసార్లు బీజేపీ గెలుపొందింది. 1971లో ఒకసారి మాత్రమే తెలంగాణ ప్రజా సమితి గెలుపొందింది. ఆ పార్టీ నుంచి విజయం సాధించిన ఎంఎం హషీం ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా సికింద్రాబాద్ నుంచే గెలుపొందారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని ఐదు సార్లు బీజేపీ గెలుపొందితే, అందులో నాలుగుసార్లు బండారు దత్తాత్రేయే. 1991లో బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయ తొలిసారి గెలుపొందగా, ఆ తర్వాత 1995లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 1998, 1999లో బీజేపీ గెలుపొందితే.. 2004, 2009లో కాంగ్రెస్ దక్కించుకున్నది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014, 2019లో బీజేపీ కైవసం చేసుకున్నది. ఇలా 25 ఏళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తలపడుతూ వరుసగా రెండు దఫాలుగా గెలుపొందుతూ వస్తున్నాయి.
ఈసారి భిన్న వాతావరణం
రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీజేపీలే గాకుండా బీఆర్ఎస్ కూడా పోటీ పడుతోంది. త్రిముఖ పోరులో బీజేపీనే గెలుస్తూ వచ్చింది. ప్రస్తుతం బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. గతంతో పోల్చితే ఈసారి పోటీ చేసే అభ్యర్థులంతా హేమాహేమీలే. వీరిలో ఎవరు విజయ పతాకం ఎగురవేస్తారో అనే ఉత్కంఠ ఏర్పడింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఇప్పటి వరకు బీఆర్ఎస్ దక్కించుకోలేదు. రాష్ట్రానికి గుండెకాయలాంటి హైదరాబాద్ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఖాతానే తెరువలేదు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒకటి మినహా మిగతా ఆరు స్థానాలను బీఆర్ఎస్నే కైవసం చేసుకుంది. ఈనేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
————————————–