
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చంద్రగ్రహణం నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు అన్నింటినీ మూసివేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన, ఉప, అనుబంధ ఆలయాలను ఈరోజు మధ్యాహ్నం నుంచి మూసివేసినట్లుగా అధికారులు తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ముగించి ఆలయాన్ని మూసివేయనున్నారు. యాదగిరిగుట్ట (Yadigirigutta) లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మధ్యాహ్నం 12 గంటల వరకే భక్తులకు అనుమతి ఇచ్చి అనంతరం మూసివేశారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేసి సుప్రభాతం, బిందె తీర్థం, బాలభోగం, నిజాభి సహస్రనామార్చనలను అర్చకులు నిర్వహించనున్నారు. వరంగల్ (Warangal) లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని కూడా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మూసి వేశారు. కొంగట్టు అంజన్న ఆలయం, భద్రాచలం రామాలయం, హనుమకొండ వేయిస్తంభాల గుడి, ములుగు (Mulugu) జిల్లా రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం మూతపడ్డాయి. చంద్రగ్రహణం అనంతరం రేపు తెల్లవారు జామున సంప్రోక్షణ చేసి, ఉదయం 6 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
……………………………….