
* భారీ వానలతో ఉప్పొంగుతున్న నాలాలు
* పౌరుల గల్లంతు ఘటనలతో ఉలికిపాటు
* ప్రమాదకరంగా నాలా పరిసరాలు
* నిన్న రాత్రి మరోసారి భయపెట్టిన వాన
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
భారీ వానలు హైదరాబాద్‌ను వణికిస్తున్నాయి. సాయంత్రం వరకూ సాధారణంగానే ఉంటున్నా, రాత్రయితే వరుణుడు విరుచుకుపడుతున్నాడు. అడపాదడపా మినహా కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి. ఆదివారం రాత్రి దంచికొట్టిన వానకు వేర్వేరు ప్రాంతాల్లో వరద నీటిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. మాంగార్ బస్తీలో ఇద్దరు, ముషీరాబాద్‌లో ఒకరు గల్లంతు అయ్యారు. వారందరూ నాలా పరిసరవాసులే కావడం గమనార్హం. నాలాల విస్తరణలు జరగకపోవడం, రిటైల్ వాల్ లేకపోవడమే ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది.
వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఘటనలు
మాంగార్ బస్తీలో నాలాపైనే స్థానికులు నివాసాలు ఏర్పాటు చేశారు. ఇళ్ల ముందు ఐదు అడుగుల మేర చిన్న రహదారి ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డుపై కూర్చొని కుటుంబ సభ్యులతో పిచ్చాపాటి మాట్లాడుతుంటారు. ఆదివారమూ అదే జరిగినట్టు తెలిసింది. రోడ్డుపై మంచం వేసుకొని కూర్చున్న కుటుంబసభ్యులు వర్షం మొదలు కాగానే ఇళ్లలోకి వెళ్లారు. కొద్ది సేపటి అనంతరం బయట ఉన్న మంచం తీసుకువెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చిన రాము అప్పటికే మూడు, నాలుగు అడుగుల మేర ప్రవహిస్తోన్న వరద ఉధృతికి కింద పడిపోయాడు. అది గమనించిన అర్జున్ వరదలోకి దిగి రామును కాపాడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరూ వరద నీటిలో గల్లంతయ్యారు.
ప్రతిపాదనలకే పరిమితం
హైదరాబాద్‌లో నాలాల విస్తరణ అధ్యయనాలు ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి. 2020లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం, నగరంలోని వందల కాలనీలు, బస్తీలు నీట మునగడంతో ఎస్ఎన్డీపీకి శ్రీకారం చుట్టారు. వర్షపు నీరు వెళ్లేలా బాక్స్ డ్రైన్ల నిర్మాణం చేపట్టారు. విస్తరణ చేపట్టే పరిస్థితి లేకపోవడంతో కొన్ని చోట్ల పక్కనున్న ఇళ్లలోకి వరద నీరు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. కానీ అవి పూర్తిస్థాయిలో భద్రతను ఇవ్వలేకపోతున్నాయి. మేజర్ నాలాలపై 12 వేలకుపైగా ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని తొలగించి విస్తరణ పనులు చేపట్టేందుకు రూ.10 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో పనుల్లో పురోగతి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
నిన్న రాత్రి వరుణుడి విజృంభణ
హైదరాబాద్‌ను బుధవారం రాత్రి కూడా భారీ వర్షం వణికించింది. ముషీరాబాద్, సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మియాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, షేక్‌పేట, ఖైరతాబాద్, సీతాఫల్మండి, చందానగర్, బన్సీలాల్‌పేట, కంటోన్మెంట్, పాటిగడ్డ, అమీర్ పేట, బంజారాహిల్స్, బాలానగర్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీరు చేరింది. కృష్ణానగర్ బీబ్లాక్‌లో వాహనాలు కొట్టుకుపోయాయి. బుధవారం రాత్రి 11 గంటల వరకు ముషీరాబాద్‌లో రికార్డుస్థాయిలో 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు ట్రాఫిక్ చిక్కుకుని విలవిలలాడారు.