
* రాజధానిలో భారీ ట్రాఫిక్ జామ్‌లు
* ఎన్ని ప్రణాళికలు వేసినా తప్పని తిప్పలు
* తల పట్టుకుంటున్న అధికారులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
చిన్నపాటి వాన పడితే చాలు.. హైదరాబాద్ రోడ్లు వాహనాలతో కిక్కిరిసిపోతాయి. నీళ్లతో నిండిన దారుల్లో వాహనం నెమ్మదిగా కదులుతుండడంతో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతాయి. అలాంటిది నాలుగు రోజులుగా సాయంత్రమైతే చాలు.. వాన దంచికొడుతోంది. దీంతో నగరమంతా ఎక్కడపడితే అక్కడ వాహనాలు బారులుదీరుతున్నాయి. గురువారం రాత్రి కూడా సేమ్ సీన్ కనిపించింది. టోలీచౌకి బ్రిడ్జి వద్ద, కుత్బుల్లాపూర్ నుంచి సుచిత్ర, మియాపూర్ నుంచి జేఎన్టీయూ, కూకట్పల్లి, మూసాపేట్, అమీర్‌పేట్, షేక్‌పేట్ ఫ్లై ఓవర్, ఐటీ కారిడార్లు వాహనాలతో స్తంభించిపోయాయి.
పోలీసులకూ చిక్కులే..
ట్రాఫిక్ ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎన్ని ప్రణాళికలు వేసినా తిప్పలు తప్పడం లేదు. దీంతో వారు కూడా తల పట్టుకుంటున్నారు. ప్రధానంగా సైబరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లోని ప్రధాన రోడ్లపై భారీగా నిలిచిపోతున్న వరదనీటితో వాహనాలు ముందుకు కదలలేక పోతున్నాయి. వరదనీరు పూర్తి వెళ్లిపోయే వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు వచ్చిపోయే ప్రధాన మార్గాల్లోనే ట్రాఫిక్ జామ్ సమస్యలు ఉండడంతో వాహనదారులు గంటల తరబడి అదే మార్గంలో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు వాహనదారులకే కాకుండా ట్రాఫిక్ పోలీసులకు కత్తిసాములా మారింది.
వర్షం కురిసినప్పుడల్లా..
కూకట్పల్లి వైపు జెఎన్టీయూ మీదుగా సైబర్ టవర్స్, మైండ్‌స్పేస్ జంక్షన్ ప్రాంతాలకు రావాలంటే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఉంటోంది. ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం 90 శాతం మంది తీసివేయడంతో ఐటీ కార్యాలయాలకు రావాల్సి వస్తోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజుల పాటు ఉండే ట్రాఫిక్ కష్టాలకు తోడు వర్షం కురిసినప్పుడల్లా అంతకు మించి అన్నట్లుగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. ఐటీ కారిడార్లోకి నలువైపుల నుంచి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతోనే సాధారణ రోజుల్లో, వర్షం కురిసినప్పుడల్లా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు.
………………………………………