విద్యార్థులు.. యువతల్లారా.. మీరే టార్గెట్!
ఆకేరు న్యూస్, సండే స్పెషల్ స్టోరీ
తక్కువ సమయంలో ఎక్కువ లాభాల పేరుతో సైబర్ మోసం.. ఏపీకే లింక్ పంపి ఖాతాలు స్వాహా.. ఇటువంటి పేర్లతో నిత్యం సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందరో బాధితులవుతున్నారు. లక్షలాది రూపాయల సొమ్మును పోగొట్టుకుంటున్నారు. వీళ్లందరూ నిరక్ష్యరాస్యులో, అజాగ్రత్తల వల్ల సైబర్ మోసాల బారిన పడుతున్న వారు కాదు. చదువుకుంటున్న విద్యార్థులు, ఉన్నత చదువులు చదివిన యువత, ఐటీ ఉద్యోగులే ఎక్కువగా మోసపోతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. విద్యార్థులు,యువతనే సైబర్ నేరగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. సైబర్ మోసాలపై నాక్ఔట్ డిజిటల్ ఫ్రాడ్ పేరుతో బజాజ్ ఫిన్సర్వ్ నిర్వహించిన ఓ సర్వేలో విషయం వెల్లడైంది.
సైబర్ వల విసురుతారు ఇలా..
సైబర్ నేరగాళ్లు నిత్యం వంద మందికి పైగా టార్గెట్ చేస్తారు. ఫోన్ కాల్స్, లింకులు పంపి వల వేస్తుంటారు. స్టాక్ ఇన్వెస్ట్మెంట్, టాస్క్ గేమ్, ఫెడెక్స్, ట్రాయ్ కాల్, పార్ట్ టైం జాబ్ వివిధ పద్ధతిలో బాధితులకు ఫోన్ చేసి నమ్మిస్తారు. తాజాగా మనీ ల్యాండరింగ్ కేసులు ఉన్నాయంటూ బెదిరింపు కాల్స్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా విద్యార్థులను, యువతను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుని లింకులు పంపుతున్నారు. చదువుకున్న వారైనప్పటికీ అత్యాశకు, అవసరాలకు సొమ్ముల కోసం ఆ లింకులను క్లిక్ చేసి నేరగాళ్ల బారిన పడుతున్నారు
సోషల్మీడియా ఎఫెక్ట్ తో..
విద్యార్థులు, యువత అవసరాలను, ఆశలను పసిగట్టి సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటూ ఉంటారని పోలీసులు చెబుతున్నారు. సైబర్ మోసాలపై నాక్ఔట్ డిజిటల్ ఫ్రాడ్ పేరుతో బజాజ్ ఫిన్సర్వ్ నిర్వహించిన ఓ అవగాహన కార్యక్రమంలో ఈమేరకు పలు అంశాలను వెల్లడించారు. విద్యార్థులు, యువతనే మోసగాళ్లకు సాఫ్ట్ టార్గెట్ అవుతుంటారని తెలిపారు. వారు తమ వ్యక్తిగత వివరాలను ఆలోచించకుండా సోషల్మీడియాలో పంచుకుంటారని, ఎవరినైనా ఈజీగా నమ్మేస్తారని అన్నారు. ఈ అలవాట్లే వారిని సైబర్ నేరగాళ్ల బారిన పడేలా చేస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే సోషల్మీడియా ప్రొఫైల్ను గోప్యంగా ఉంచుకోవాలని సూచించారు. సోషల్మీడియా ఖాతాలకు బలమైన పాస్వర్డ్లను పెట్టుకోవాలని.. టు స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేసుకోవాలని సలహా ఇచ్చారు.
మోసాల బారిన ఇలా..
ఎన్బీఎఫ్సీల కోసం రిజర్వ్ బ్యాంక్ 2024లో విడుదల చేసిన ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ మార్గదర్శకాలకు అనుగుణంగా నాక్ఔట్ డిజిటల్ ఫ్రాడ్ కార్యక్రమం ఉంది. ఈ మార్గదర్శకాలు మోసాలను తొలిదశలో గుర్తించడం, సిబ్బంది బాధ్యతను నిర్ధారించడం, ప్రజలతో సక్రియ భాగస్వామ్యం కల్పించడం వంటి అంశాల ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. ముఖ్యంగా నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ గ్రూపులు, ఆర్థిక సంస్థలను అనుకరించే వెబ్సైట్లు, స్కామర్లు తప్పుడు అనుబంధాలు క్లెయిమ్ చేయడం, సంస్థ ఉద్యోగులను అనుకరించడం, వ్యక్తిగత సమాచారాన్ని చెల్లింపుల కోసం దుర్వినియోగించడం వంటి పలు పద్ధతుల వల్ల మోసాలకు గురవుతున్నారు. నకిలీ ఓటీపీ మోసాలు, ఫిషింగ్ దందాలు, డిజిటల్ అరెస్టులు, ఆర్థిక రుణ మోసాలు, పింఛన్ మోసాలు తదితర మోసాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.
…………………………………………….
