ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. రేపు ఓటేసేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ లోని ఏపీ ఓటర్లు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. తెలంగాణలోని గ్రామీణ ఓటర్లు ఊళ్లకు బయలుదేరారు. అయితేవారిలో చాలా మందికి హైదరాబాద్ లోనూ, ఊరిలోను కూడా ఓటరు కార్డులు ఉన్నాయి. అయితే వాళ్లు రెండు చోట్ల ఓటు హక్కును ఉపయోగించుకుంటే ఏమవుతుందని చాలామందికి అనుమానం ఉంటుంది. కానీ వాళ్లు అలా ఓటు వేయకూడదని ఈసీ అధికారులు చెబుతున్నారు. నిజానికి భారతదేశంలో మొత్తం జనాభా 140 కోట్లు దాటిపోయింది.కానీ వీరిలో సుమారు 80% మంది ఓటు హక్కు కలిగి ఉన్నట్లు చెబుతున్నా.. గణాంకాల ప్రకారం మాత్రం.. 70% మంది మాత్రమే ఓటు హక్కును కలిగి ఉన్నారు. అయితే ఈ సారి ఎన్నికలలో కొత్త ఓట్లు భారీగా చేరినా కూడా ఇంకా చాలామంది ఓటును వినియోగించుకోవడానికి ఆయుధం అయిన ఓటర్ కార్డు కోసం ప్రయత్నించడం లేదన్న వాదన వినిపిస్తోంది.
చట్టరీత్యానేరం
ఇక మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో చాలామంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే కొంత మంది ఓటర్లకు తమ పేర్లు రెండు వేర్వేరు ప్రాంతాల్లో.. రెండు ఓటరు కార్డులు ఉంటాయి. నిజానికి ఒక వ్యక్తికి ఒకే ఓటరు కార్డు ఉంటుంది. కానీ కొన్ని కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో ఉండి ఓటరు కార్డు కోసం అప్లై చేస్తే..వాళ్లకు రెండు ఓటరు కార్డులు ఉంటాయి. కానీ రెండు ఓటరు కార్డులు ఉన్నా కూడా ఈసీ నిబంధనల ప్రకారం ఒక చోట మాత్రమే ఉపయోగించుకోవాలి. అలా కాకుండా రెండు చోట్ల కూడా ఓటు వేస్తే చట్టరీత్యా నేరం అవుతుంది. అందుకే రెండు ఓటరు కార్డులున్నవాళ్లు అందులో ఒక దానిని వినియోగించుకుని రెండోది రద్దు చేసుకోవాలి.
హైదరాబాద్లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఇదో కారణం
అంతేకాదు ఒక వ్యక్తికి రెండు ఓటరు కార్డులుంటే అది ఎన్నికల సంఘంలోని రూల్ నెంబర్ 17ను ఉల్లంఘించినట్లే. చట్ట ప్రకారం వారికి ఏడాది పాటు జైలు శిక్ష విధించబడుతుంది. అందుకే రెండు చోట్ల ఓటింగ్ కార్డులను కలిగి ఉన్నవాళ్లు చాలామంది ఒకదానిని రద్దు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా పెండింగ్ ఉన్న వారు ఓటింగ్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. కాగా,హైదరాబాద్ లో ప్రతిసారీ ఓటింగ్ శాతం తక్కువ కావడానికి ఇక్కడ, ఊరిలోను రెండు చోట్లా ఓటరు కార్డు ఉన్నవారు.. సొంతూరికే వెళ్లడం కూడా ఒక కారణమే. సంఖ్యాపరంగా ఉన్న ఇక్కడ ఓటరు అయినప్పటికీ, ఊళ్లో కూడా ఓటు నమోదు చేసుకుని ఉండడంతో అక్కడే ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నగరంలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది.
———————