
* తెలంగాణ వ్యాప్తంగా వానలు కురిసే అవకాశం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. సుమారు 10 సెం.మీ వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. కొద్ది రోజులుగా వర్షాలతో హైదరాబాద్ (HYDERABAD) అతలాకుతలం అవుతోంది. చాలా రోజుల తర్వాత నిన్న వాన కాస్త తెరిపినిచ్చింది. హమ్మయ్య.. అనుకునేలోపు వాతావరణ కేంద్రం పిడుగులాంటి వార్త వెల్లడించింది. ఉత్తర ఒడిశా గ్యాంగ్ టెక్ వెస్ట్ బెంగాల్ (WEST BENGAL) తీరాల సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని, సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిమీ ఎత్తువరకు కొనసాగుతూ.. ఎత్తుకు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు ఉపరితల ఆవర్తనం వాలి ఉందని వివరించింది. ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ దిక్కులో కదులుతూ బలపడి వాయువ్య దానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు వాయుగుండంగా మారుతుందన్నారు. ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో ఎల్లుండి తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ(TELANGANA)లోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో తేలికపాటి ఉరుములతో భారీ వర్షం కురవనుంది. గురువారం ఉదయం నుంచీ హైదరాబాద్ లో వాతావరణం మబ్బులు కమ్మి ఉంది.