
* మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఆకేరున్యూస్ ఖమ్మం : పెనుబల్లి : ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. హైవే పనులను గురువారం ఆయన పరిశీలించారు. ప్రాజెక్ట్ పరిధిలో భూములు కోల్పోయే రైతుల బాధను ప్రభుత్వం సున్నితంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. వారి భూ హక్కులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు.
హైవే పనుల పరిశీలన
మంత్రి శ్రీనివాస రెడ్డి పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద హైవే పనులను ఎంట్రీ–ఎగ్జిట్ ప్రాంతంలో గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికే ఇచ్చిన ధరకు అదనంగా 12 శాతం నష్టపరిహారం రైతుల డిమాండ్ ప్రకారం చెల్లించాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు.
మిగిలిన ముక్కల భూములకూ నష్టపరిహారం
హైవే నిర్మాణంలో ముక్కలుగా మిగిలిన రైతు భూములకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని మంత్రి సూచించారు. రైతుల సాగు ప్రక్రియకు ఇబ్బంది కలగకుండా సర్వీస్ రోడ్లను నిర్మించాలని ఆదేశించారు. అలాగే అవసరమైన మేర డ్రెయిన్లను కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే: రాం దాస్ నాయక్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎన్హెచ్ఏఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు.