
* ఒకవైపు ప్రాణాలు..మరోవైపు రాజకీయాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : తమిళనాట టీవీకే అధినేత, హీరో విజయ్ ప్రచార కార్యక్రమం కోసం కరూర్‌కు వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తీవ్ర విషాదం నింపడంతో పాటు.. తమిళనాట రాజకీయంగానూ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇప్పుడు ఓ కార్యకర్త ఆత్మహత్యతో మరింత ఆందోళనలకు కారణమవుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాకు చెందిన అయ్యప్పన్ (51) విజయ్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచీ టీవీకే పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం తన వృద్ధ తల్లిదండ్రులను చూసేందుకని మైలం గ్రామానికి వెళ్లారు. అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన ఆయన తల్లి మునియమ్మల్ చుట్టుపక్కల వారికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
డీఎంకే మంత్రే కారణం..
అయ్యప్పన్ గదిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పార్టీ చీఫ్ విజయ్ ప్రచారం సందర్భంగా 41 మంది ప్రాణాలు కోల్పోవడానికి డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji), పోలీసులే కారణమని అయ్యప్పన్ సూసైడ్ నోట్లో రాశారు. ‘టీవీకే చీఫ్ విజయ్ కరూర్ వచ్చినప్పుడు తగినంత పోలీసు రక్షణ లేదు. మంత్రి సెంథిల్ బాలాజీ కారణంగానే ఈ విషాదం జరిగింది. ఇందులో పోలీసుల ప్రమేయం కూడా ఉంది. మంత్రిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలి’ అని అయ్యప్పన్ సూసైడ్ నోట్లో రాశారు. సూసైడ్ నోట్ తో రాజకీయ వాతావరణం ఇప్పుడు మరింత వేడెక్కింది.
…………………………………………………