
* గెస్ట్ లెక్చరర్ల జీతాలపై హరీష్ రావు ఫైర్
* 9 నెలలుగా ఇంటర్ గెస్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వడం లేదు
* సీఎం సొంత జిల్లాలో కూడా ఇదే పరిస్థితి
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : ఇంటర్ గెస్ట్ లెక్చరర్లకు జీతాలు చెల్లించి సీఎం రేవంత్ తన పరువు కాపాడుకోవాలని బీఆర్ ఎస్ నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఇంటర్ గెస్ట్ లెక్చరర్ల జీతాలపై స్పందించారు. 9 నెలలుగా జీతాలు లేక గెస్ట్ లెక్చచర్లు ఇబ్బందులు పడుతున్నారని దసరా బతుకమ్మపండుగలు కూడా జరుపుకోలేదని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉంటే వారి బతుకు ఎలా సాగుతుంది, కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జీతాలు లేక పోవడంతో విసిగివేసారిన లెక్చరర్లు తమ విధులకు వెళ్లడం లేదని హరీష్ రావు తెలిపారు. పాఠాలు చెప్పే గురువులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని హరీష్ విమర్శించారు. సీఎం సొంత జిల్లాలో కూడా జీతాలు ఇవ్వక పోవడం సిగ్గుచేటని హరీష్ రావు పేర్కొన్నారు.
………………………………………..