
* ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఆకేరు న్యూస్, ములుగు:ములుగు జిల్లాలో ఏటూర్ నాగారం, కన్నాయిగూడెం ,వాజేడు, వెంకటాపురం ,మంగపేట తదితర మండలాల్లో మొదటి విడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ టీ ఎస్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో 5 జడ్పిటిసి మరియు 30 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.
నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఎంపీడీవో కార్యాలయంలోనే జడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు.జిల్లాలో ఎంపిటిసి ఎన్నికల కోసం 14 రిటర్నింగ్ అధికారులను, జడ్పిటిసి ఎన్నికల కోసం 05 రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు
ఆర్ ఓ, ఏ ఆర్ ఓ లకు శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు.జిల్లాలో మొదటి విడత జరుగనున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్లు స్వీకరణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొదటి విడతనామినేషన్ కేంద్రాలకు 100 మీటర్లు దూరం వరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలనీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఎలాంటి విరుద్ధ చర్యలు చోటు చేసుకోకుండా కఠినంగా పర్యవేక్షించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లుతో శాంతి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులు అధికారులకు సూచించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తెలిపారు.
………………………………………………………………….