
* జీవో 9పై హైకోర్టు స్టే
* 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్థానిక సంస్థల నిర్వహణకు ఈరోజు ఉదయమే షెడ్యూల్ ప్రకారం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయగా, సాయంత్రానికి ఎన్నికల ప్రక్రియను నిలిపేయాల్సిన పరిస్థితి ఎదురైంది. జీవో నంబర్ ఎంఎస్ 9పై హైకోర్టు స్టే విధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా హైకోర్టు స్టే ఇచ్చినట్లేనని న్యాయవాదులు స్పష్టం చేశారు. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, పిటిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సర్కారు సిద్ధమైన నేపథ్యంలో తాజా తీర్పుతో ఆ ప్రక్రియ నిలిచిపోనుంది. ప్రభుత్వానికి ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మళ్లీ కొత్త నోటిఫికేషన్‌తోనే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
ప్రభుత్వం తరఫున వాదనలు ఇలా..
అయితే ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రవివర్మ వాదనలు ఇలా ఉన్నాయి. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై వాదనలను బలంగా వినిపించారు. రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చేందుకు తన వాదనల ద్వారా ప్రయత్నించారు. రాజ్యాంగంలో ఎక్కడా 50 శాతం సీలింగ్ లేదని, కొన్ని సందర్భాల్లో మాత్రమే సుప్రీంకోర్టు కొట్టేసిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారని, 85 శాతం జనాభాకు 42 శాతం రిజర్వేషన్లతో కలిపి 67 శాతమే రిజర్వేషన్లు అవుతాయని వివరించారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్‌గానే రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. ఓబీసీలు 57 శాతం, ఎస్సీలు 17, ఎస్టీలు 10 శాతానికి పైగా ఉన్నారని వెల్లడించారు. ఇతర కులాల వారు కేవలం 15 శాతమే ఉన్నారని, ఆ 15 శాతం జనాభాకు 33 శాతం రిజర్వేషన్లు అందుతాయని రవివర్మ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్నన్యాయస్థానం జీవో నంబర్ 9పై స్టే ఇస్తూ 4 వారాల పాటు విచారణ వాయిదా వేసింది.